ఓటర్ల తీర్పు పదిలం
సాక్షి, కాకినాడ : ఎన్నికల యజ్ఞం ముగిసింది. అన్నివర్గాలు... ఓటర్ల తీర్పు ఎలా వుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో బుధవారం ఎన్నికలు జరుగగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అర్ధరాత్రికి కాకినాడ చేరుకున్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 4056 పోలింగు స్టేషన్ల పరిధిలోని 37 లక్షల 73 వేల 332 మంది ఓటర్ల తీర్పు వీటిలో నిక్షిప్తమై ఉంది. పార్లమెంట్ నియోజవర్గాల వారీగా కేటాయించిన ప్రాంతాల్లో వీటిని ఉంచారు. ఈవీఎంలు దాచిన మూడుచోట్లా అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షిప్టుల వారీగా ఆర్ముడు ఫోర్సును విధుల్లో వుంచారు. తరలివచ్చిన ఈవీఎంలను కాకినాడ జేఎన్‌టీయూకే ఆవరణలో బుధవారం రాత్రి ఎన్నికల పరిశీలకులు గౌతమ్‌ఘోష్‌తో కలసి జిల్లా ఎన్నికల అధికారి నీతూప్రసాద్ పరిశీలించారు.
కాకినాడ లోక్‌సభ స్థానానికి జేఎన్‌టీయూకే ఆవరణలో
కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 1491 పోలింగుస్టేషన్లకు చెందిన 14 లక్షల 17 వేల 977 మంది ఓటర్లున్నారు. వీటిలో తుని, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, జగ్గంపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ జేఎన్‌టీయూకే ఆవరణలోని డిపార్టుమెంటు ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగు బ్లాక్, స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బ్లాక్‌లోని హాల్స్‌లో భద్రపరిచారు. వాటికి ఆనుకుని వున్న గదుల్లోనే ఈ నెల 16 వ తేదీనపై ఏడు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటిగంట లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం వుంది.
విద్యుత్‌నగర్ ఐడియల్ ఇంజనీరింగ్‌లో అమలాపురం కౌంటింగ్ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 1500 పోలింగు స్టేషన్లకు చెందిన 13 లక్షల 57 475 మంది ఓటర్లున్నారు. వీటిలో రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ విద్యుత్ నగర్‌లోని ఐడియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో భద్రపరిచారు. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలో వుండి మన జిల్లాలో వున్న రంపచోడవరం అసెంబ్లీ పరిధిలో 212 పోలింగ్ స్టేషన్లుండగా లక్షా యాభై వేల 830 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గ ఈవీఎంలు సైతం ఇక్కడే భద్రపరిచారు. వాటిని సివిల్ బ్లాక్‌కు చెందిన ఫస్టు ఫ్లోర్‌లోని ఎడమవైపున్న 14,16 నెంబర్ గదుల్లో భద్రపరిచారు. కుడివైపున్న 13 వ నెంబర్ రూమ్‌లో ఓట్లు లెక్కించి ఫలితాన్ని విశాఖ పంపుతారు.
రాజమండ్రి లోక్‌సభ స్థానానికి ఆర్‌ఎంసీ ఆవరణలో...
ఇక రాజమండ్రి పరిధిలోని 853 పోలింగు స్టేషన్లకు చెందిన 8 లక్షల 47 వేల 40 మంది ఓటర్లున్నారు. వీటిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలోని డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, పరీక్షా కేంద్రాలలో లెక్కిస్తారు, వీటిని చేర్చివున్న విభాగాల్లోని గరల్స్, బాయిస్ వెయిటింగు రూమ్స్ తదితర చోట్ల ఆయా నియోజక వర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. పశ్చిమగోదావరిలో వున్న మిగిలిన మూడు నియోజవర్గాలు గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు ఆ జిల్లాలో పూర్తిచేసి ఫలితాలు అందించాక పార్లమెంటు ఫలితం మొత్తంగా ప్రకటిస్తారు.