
స్ట్రాంగ్ రూంలకు ‘మున్సిపల్’ ఈవీఎంలు
* భారీ భద్రత మధ్య తరలించాలని ఈసీ ఆదేశం
* లెక్కింపు కేంద్రాల నుంచి తరలించే సమయంలో అభ్యర్థులు వెంట ఉండొచ్చు
* బాక్సులు భద్రపర్చిన ప్రదేశంలో అభ్యర్థుల అనుచరులూ ఉండేందుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపు, ఫలితాలు మే రెండో వారం వరకు వాయిదాపడడంతో... మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. గత నెల 30న రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేషన్లు, 145 మున్సిపాలిటీలకు ఈవీ ఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు.
ఈ నెల 9న ఓట్ల లెక్కింపునకు వీలుగా ఈవీఎంలను ఇప్పటివర కు లెక్కింపు కేం ద్రాల్లో ఉంచారు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో వీటిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో సంప్రదించి స్ట్రాంగ్‌రూంలకు తరలించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు.
ఈవీఎంలను లెక్కింపుకేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించే సమయంలో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమతమ వాహనాల్లో వెనుక రావడానికి అనుమతించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూంల వద్ద అభ్యర్థుల అనుచరులు ఉండడానికి వీలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇదిలాఉండగా, మున్సిపల్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌లను కూడా జిల్లా కేంద్రంలో ఒకే దగ్గర భద్రపరచనున్నట్లు సమాచారం.
స్ట్రాంగ్ రూంలలో లైటింగ్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చూడాలని నవీన్‌మిట్టల్ సూచించారు. ఒక మున్సిపాలిటీ ఈవీఎంలను ఇతర మున్సిపాలిటీలతో కలపకుండా జాగ్రత్తపడాలని, 24 గంటలపాటు స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.