సంపాదకీయం: ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలంటూ ప్రజాస్వామ్యవాదులు, మేధావులు దశాబ్దాలనుంచి పోరుపెడుతున్నా పట్టించుకోని పాలకవర్గాలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు శరాఘాతంవంటిది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పి తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుందని, ఆ హక్కుకు విఘాతం కలిగించడం పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తీర్పునిస్తూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి ఓటర్లకు వీలుకల్పిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనంగా మీటను పొందుపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదని, అది చట్టపరమైన హక్కు మాత్రమేనని... కనుక 32వ అధికరణం కింద దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చాలని కేంద్రం చేసిన వాదనను తిరస్కరించింది. ఎన్నికల్లో ఓటు వేయడం అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తిస్వేచ్ఛలోనూ భాగమని తెలియజేసింది.
నిజానికి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో తనకెవరూ సమ్మతం కాదని తెలిపేందుకు ఓటరుకు ఇప్పటికే వీలుంది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని 49(ఒ) దాన్ని ఓటరుకు కల్పి స్తోంది. అయితే, నిజానికది అభ్యర్థులందరినీ తిరస్కరించడంతో సమానం కాదు. ఈ ఓటింగ్ ప్రక్రియనుంచి తాను గైర్హాజరవుతున్నానని చెప్పడానికి మాత్రమే వీలుకల్పించే నిబంధన అది. పైగా, అందుకోసం పోలింగ్ అధికారుల దగ్గర ఒక పత్రాన్ని తీసుకుని దాన్ని నింపి సంతకం చేయాల్సి ఉంటుంది. ఆతర్వాత ఫలానా ఓటరు ఓటింగ్‌నుంచి గైర్హాజరైనట్టు వేర్వేరు రిజిస్టర్లలో నమోదవుతుంది.
ఓటేసినవారు ఎవరికి వేశారో తెలియకుండా గోప్యత ఉండగా... అందుకు భిన్నంగా ఉండేవారు మాత్రం వీధినపడటానికి ఇందువల్ల అవకాశం ఏర్పడుతోంది. కనుకనే ఈ నిబంధన చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే, నెగెటివ్ ఓటుకు అవకాశం కల్పించడంలో చాలా చిక్కుముడులున్నాయి. మన దేశంలో నిరక్షరాస్యత ఇప్పటికీ గణనీయంగా ఉంది. చదవగలిగినవారు సైతం ఏ పార్టీ అభ్యర్థినైనా వారి పేరుతో కాక...ఆ అభ్యర్థి పోటీచేస్తున్న పార్టీ గుర్తుతో మాత్రమే గుర్తిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి ఏమి వాడవలసివస్తుందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందుకోసం వాడే గుర్తు ఏ అభ్యర్థి గుర్తుకైనా దగ్గరగా ఉంటే ఆ ఓట్లన్నీ అయాచితంగా అటు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే, ఒక నియోజకవర్గంలో అభ్యర్థులందరూ నచ్చలేదని చెప్పేవారి సంఖ్య ఎక్కువైతే పరిస్థితేమిటో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉండనే ఉండవని చెప్పడానికి వీల్లేదు. ఎన్నికల బహిష్కరణకు మిలిటెంట్ సంస్థలు పిలుపునిస్తుంటాయి. ఆ పిలుపు ప్రభావం పెద్దగా లేని మాట వాస్తవమే అయినా... అందరినీ కదలించగలిగే సమస్యను ఆసరాచేసుకుని నెగెటివ్ ఓటు వేయాలని ప్రచారంచేస్తే అది ఫలించే అవకాశాన్ని తోసిపుచ్చలేం.
అలాంటి పరిస్థితి ఏర్పడితే ఏంచేయాలో కూడా ఆలోచించాల్సిందే. అక్కడ మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా?ఆ ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులను మార్చుకోమని పార్టీలకు సూచిస్తారా? మన ఎన్నికల ప్రక్రియలో నిజానికి ఓటువేసే వారి శాతం నానాటికీ తగ్గుతోంది. సామాన్య ప్రజలు అందులో పాల్గొన్నంత చురుగ్గా ఎగువ మధ్యతరగతి, ఆపై వర్గాలు పాల్గొనడంలేదు.70 శాతం పోలింగ్ జరిగితే అది చాలా ఎక్కువనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చినవారిలో గణనీయంగా నెగెటివ్ ఓటేస్తే... విజేతగా నిలిచినవారి మెజారిటీ చాలా స్వల్పంగానే ఉంటుంది. విజేతకు కనీసం పోలైన ఓట్లలో 51శాతం వస్తేనే నెగ్గినట్టవుతుందన్న నిబంధన పెట్టకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అయితే, నెగెటివ్ ఓటు అవకాశాన్ని ఇవ్వడంవల్ల ఇంతవరకూ ఎవరొచ్చినా ఒరిగేదేమీ లేదని నిర్లిప్తత ప్రదర్శించేవారు సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ హక్కును వినియోగించుకునే వీలుంటుంది. ఇంతకాలం ఇలా దూరంగా ఉండేవారి ఓట్లను స్థానికంగా ఉండే పెత్తందార్లు తమ ఖాతాలో వేసుకునేవారు. ఇప్పుడు అలాంటి దొంగ ఓట్ల బెడద తప్పుతుంది.
వివిధ వర్గాలనుంచి వచ్చే సూచనలను పరిశీలించడం, వాటి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం... అందుకోసం రాజకీయ పార్టీలతో, ఇతరత్రా సంస్థలతో చర్చించడం ప్రభుత్వాల కర్తవ్యం. సమష్టి చర్చల్లో నెగెటివ్ ఓటువల్లనైనా, మరే ఇతర చర్యవల్లనైనా రాగల అవరోధాలేమిటో, వాటిని అధిగమించడమెలాగో సూచనలు వస్తాయి.
ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని విస్మరించడంవల్ల న్యాయ స్థానాల జోక్యం అవసరమవుతున్నది. 70వ దశకంనుంచి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు చేసిన డిమాండ్ల సంగతి అలావుంచి, 2001లో ఎన్నికల సంఘమే ఓటర్లకు నెగెటివ్ ఓటుకు అవకాశం కల్పించేలా చట్టంలో మార్పులుచేయాలని లేఖరాస్తే దానిపై పుష్కరకాలందాటినా ఈనాటికీ అతీగతీ లేదు. రెండేళ్లక్రితం అన్నా హజారే బృందం సైతం ఇలాంటి సూచన చేసింది. చాన్నాళ్లక్రితం లా కమిషన్ 170వ నివేదిక కూడా నెగెటివ్ ఓటు గురించి సిఫార్సుచేసింది. దానికీ స్పందన లేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంచేసుకుని తీర్పునిచ్చేదాకా ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. అయితే, పిటిషన్ విచారణ సమయంలో పార్టీల అభిప్రాయాలను కూడా న్యాయస్థానం వినివుంటే తీర్పు మరింత సమగ్రంగా ఉండేది. చేయాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒక మెట్టు మాత్రమే. కనీసం మిగిలిన సంస్కరణల విషయాల్లోనైనా కేంద్రంలో కదలికరావాలి. తాను చొరవ తీసుకోవడంలో విఫలమైతే ఇలా న్యాయస్థానాల జోక్యం తప్పనిసరవుతుందని గ్రహించాలి.
వద్దనడమూ ఓటే!
Published Sat, Sep 28 2013 11:31 PM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement