సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) ద్వారా ఓటేసే విధానం వచ్చిన తర్వాత.. ఆ ఓటు ఎవరికి పడిందోననే అనుమానం మీలో ఏదో మూలన దాగుంది కదూ..! నిజంగా మీరు వేయాలనుకున్న వారికే ఓటు పడిందా..? ఎవరైనా ఆ మెషిన్‌ను టాంపరింగ్ చేశారా..? మీరు ఒకరికి వేస్తే మరొకరికి ఓటు పడి ఉంటుందా?... ఇలాంటి సందేహాలు గతంలో ఓటేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా?.. ఇకపై అలాంటి సందేహాలు అక్కర్లేదు.
వీటికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల సంఘం చెక్ పెట్టనుంది. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలను తీర్చడంతో పాటు ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా ‘ఓట్ కన్ఫర్మేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అంటే మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుందన్నమాట. అయితే, ఈ విధానాన్ని ఈసారి ఎన్నికలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద మన జిల్లా ఎంపికవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఓట్‌ను నిర్ధారించే విధంగా ఉండే ఈవీఎంల అందుబాటు, సిబ్బంది సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టును ఎక్కడెక్కడ అమలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ మన జిల్లా ఎంపికయితే, కనీసం ఒకటి, రెండు నియోజకవర్గాలలోనయినా ఈ ఓట్ కన్ఫర్మేషన్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఓటు ‘కన్‌ఫర్మ్’ అవుతుంది ఇలా..
ఎన్నికల సంఘం వర్గాల ప్రకారం... పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత ముందుగా గతంలో ఓటేసిన విధంగానే ఈవీఎంలో ఓటేయాలి. ఆ తర్వాత కన్‌ఫర్మ్ చేసుకోవాలని ఎన్నికల సిబ్బందికి చెపితే వారు మీ ఓటు కన్‌ఫర్మ్ చేస్తారు.
మీరు ఓటేసిన ఈవీఎం దగ్గరే మీరు మరో రెండు సెకన్లు నిలుచుంటే మీకు అదే ఈవీఎంలో మీరు ఏ గుర్తుకు ఓటేశారనేది డిస్‌ప్లే అవుతుంది.
ఆ తర్వాత మీ ఓటును నిర్ధారిస్తూ ఓ స్లిప్ బయటకు వస్తుంది. కానీ ఆ స్లిప్‌ను మీ చేతికి ఇవ్వరు. మీకు చూపించరు. ఆ స్లిప్ వేరే బాక్సులోనికి వెళ్లిపోతుంది. ఆ స్లిప్‌లో మీరు వేసిన ఓటు ఎవరికి పడిందో స్పష్టంగా ఉంటుంది. కానీ మీ ఓటరు నెంబరు, మీ వివరాలు ఏమీ ఉండవు. మీరు ఎవరికి ఓటేసింది బయటి వారికి కానీ, ఎన్నికల సిబ్బందికి కానీ తెలిసే అవకాశం ఉండదు. అయితే, మీ ఓటు ఎవరికి పడిందో చాలెంజ్ చేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఎన్నికల సిబ్బంది ఆ స్లిప్‌ను తీసి మీకు చూపిస్తారు.
ఓటు డౌటు ‘క్లియర్’!
Published Fri, Feb 7 2014 3:05 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement