ఇంకా సేథీ గీతలే ఎన్నికల చిహ్నాలు
Published Thu, Dec 5 2013 12:07 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
సాక్షి, న్యూఢిల్లీ: చీపురు, కారు, ఫ్యాను, సైకిల్, టెలివిజన్ ... దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కనిపించేవి ఈ 100 చిహ్నాలే. టై, నెయిల్ కట్టర్ వంటి కొన్ని వస్తువులు మినహా మిగతా చిహ్నాలన్నీ సామాన్యుడు సులువుగా గుర్తుపట్టగలిగినవే. ఓటింగ్ రోజున అభ్యర్థుల పేర్ల కంటే వారి పేర్ల పక్కనున్న ఎన్నికల చిహ్నాలే బటన్ నొక్కడంలో ఓటరుకు ఎక్కువగా తోడ్పడుతాయి. నిరక్షరాస్య ఓటర్లు ఎక్కువగా ఉన్న మనదేశంలో అభ్యర్థుల పేర్లకంటే వారి చిహ్నాలే ప్రచారంతో పాటు, ఓటింగ్‌లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణలో అనేక మార్పులు తెచ్చిన ఎన్నికల కమిషన్ చిహ్నాల విషయంలో మాత్రం మార్పుల జోలికి వెళ్లడం లేదు. తమ డ్రాఫ్ట్స్‌మేన్ ఎంఎస్ సేథీ గీసిన చిహ్నాలనే ఎన్నికల కమిషన్ ఇంకా వాడుతోంది.
1992 సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ చేసిన సేథీ మరణించి చాలా కాలమవుతున్నా ఎన్నికల చిహ్నాల్లో మాత్రం మార్పు రాలేదు. సామాన్యుడు సులువుగా గుర్తించడం కోసం అతను నిత్య జీవితంలో వాడే వస్తువులనే ఎన్నికల చిహ్నాల జాబితాలో చేర్చారు. అప్పట్లో ఎన్నికల అధికారులు సూచించిన చిహ్నాలను సేథీ హెచ్‌బీ పెన్సిళ్ల సహాయంతో గీశారు. సేథీ పదవీ విరమణ చేసిన పదేళ్ల తరువాత ఎన్నికల కమిషన్ ఆయన గీసిన 100 చిహ్నాలతో జాబితా రూపొందించింది. వీటినే ఇప్పుడు ఫ్రీ సింబల్స్‌గా పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ వద్దనున్న చిహ్నాల జాబితాలో ఆరు చిహ్నాలను మాత్రం జాతీయ పార్టీల కోసం కేటాయించారు. రాష్ట్ర స్థాయి పార్టీల కోసం కేటాయించిన చిహ్నాలు రాష్ట్రం వరకు మాత్రమే ఆ పార్టీకి వర్తిస్తాయి. ఒక రాజకీయ పార్టీకి ఒక చిహ్నం కేటాయించాలంటే ఆ పార్టీ పది నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement