న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్‌లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాలను వెల్లడించారు. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు.
కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్ వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment