న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని మూడు దశల్లో పోలింగ్ జరపనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన ఉంటుందని వెల్లడించింది. కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధతకు పుల్‌స్టాప్ పెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ఎప్పటి మాదిరిగానే ఉదయం 7 గంటలకు మొదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కోవిడ్ బాధిత ఓటర్ల కోసం అదనంగా ఒక గంట అంటే..సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని వివరించారు.
మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటని ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యానించారు. మొదటి విడతలో అక్టోబర్ 28వ తేదీన 71 అసెంబ్లీ సీట్లకు, రెండో విడతలో నవంబర్ 3న 94 స్థానాలకు, నవంబర్ 7న జరిగే చివరి, మూడో విడతలో 78 స్థానాలకు పోలింగ్ ఉంటుందన్నారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన జరుగుతుందని తెలిపారు. మొదటి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ, మూడో దశ పోలింగ్‌కు అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఇలా ఉండగా, కోవిడ్–19 మహమ్మారి దృష్ట్యా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment