
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులంటే ఎన్నికల కమిషన్‌కు కళ్లు, చెవులు వంటి వారని, స్వేచ్ఛ, శాంతియుత, పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోర పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న అధికారులతో సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరోరా ఏం మాట్లాడారంటే..
► కోవిడ్ నేపథ్యంలో రానున్న ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
► ఓటర్ల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
► ఎన్నికల్లో పెద్ద ఎత్తున ధనం, మద్యం పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించే వారిపై స్థానిక ఎన్నికల అథారిటీల సమన్వయంతో నిరంతర నిఘా ఉంచాలి.
► ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. సీ–విజిల్, 1950 కాల్ సెంటర్‌పై ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలి. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 80 ఏళ్లు నిండిన వారికి, దివ్యాంగులకు అవకాశం కల్పించామన్నారు.
► మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో సేఫ్ ఎలక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
► వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్, బిహార్ ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న ముఖ్య కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, రాంగోపాల్‌తో పాటు కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పీయూష్‌కుమార్ సహా మరో 20 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment