భారీగా పోలింగ్ | Huge polling in nalgonda district | Sakshi
Sakshi News home page

భారీగా పోలింగ్

Published Thu, May 1 2014 2:53 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM

Huge polling in nalgonda district

ఓటర్లు చైతన్యమయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80.66శాతం మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
 
 ఇది తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికం. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడంపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేలా చైతన్యం కల్పించింది. గ్రామాలు, పట్టణాల్లో వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజాసంఘాలు చైతన్యసమావేశాలు నిర్వహించాయి. ర్యాలీల ద్వారా ఓటుహక్కు ఆవశ్యకతను వివరించాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు బుధవారం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు.
 
 సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. 41డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ వేడి అదరగొట్టినా లెక్కచేయకుండా ఓటర్లు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) మొరాయించాయి. దీంతో ఉదయం ఏడు గంటలకే మొదలు కావాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల రెండు గంటలు ఆలస్యంగా 9 గంటలకు మొదలైంది. పోలింగ్ జరుగుతుండగా కూడా అక్కడక్కడా మధ్యలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ నిలిపివేసి సరిచేశారు. చిన్నా, చితక సంఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు.
 
 నల్లగొండ
 నల్లగొండ నియోజకవర్గం పరిధి తిప్పర్తి మండలం పెద్ద సూరారంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, కాంగ్రెస్‌వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వృద్ధ ఓటర్లను కేంద్రంలోకి తీసుకెళ్లే క్రమంలో ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీంతో కేంద్రం బయట ఇరు పార్టీ కార్యకర్తల నడుమ వాగ్వాదం జరిగింది. ఆరెగూడెం, ఎల్లమ్మగూడెంలో అంగన్‌వాడీ వర్కర్లు పోల్  చిట్టీలు పంపిణీ చేయడంతో పాటు ప్రచారం చేయడంతో గొడవకు దిగారు. నల్లగొండ మండలం మర్రిగూడెం పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త అదేపనిగా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అతనిపై లాఠీచార్జీ చేశారు. కనగల్ మండలం దర్వేశిపురం, ఎం.గౌరారంలో ఈవీఎంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ గంట ఆలస్యంగా మొదలైంది.
 
 ఆలేరు
 ఆలేరు నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలింగ్ పూర్తయిన తర్వాత వదిలిపెట్టారు. రాజపేట మండలం చల్లూరులో గొడవ సృష్టిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో ఈవీఎం మొరాయించి అరగంట సేపు పోలింగ్ ఆగిపోయింది. గొల్లగూడెంలో ఇరువ ర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.  
 
 భువనగిరి
 భువనగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. భూదాన్‌పోచంపల్లి మండలం దంతూరు, కప్రాయపల్లి, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి, రాయరావుపేటల పోలింగ్ బూత్‌ల వద్ద ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. అరగంట తర్వాత సరిచేశారు. వలిగొండ మండలం పులిగిల్లలో ఓట్లు రాలేదని కొందరు గొడవకు దిగారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. యువకులు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పార్టీ జెండాలను పోలీ సులు తొల గించారు. గుంపులు గుంపులుగా ఉన్న వారిని అక్కడి నుంచి తరిమివేశారు.
 
 మునుగోడు
 మునుగోడు మండలం చీకటిమామిడి, చండూరు మండలం నెర్మట, బంగారిగడ్డ, చండూరు, కొండాపురం, నాంపల్లి మండలం లింగోటం, తుమ్మలపల్లి, వడ్డెపల్లి, నాంపల్లి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంటపాటు ఆలస్యంగా పోలింగ్  మొదలైంది. డీఐజీ శశిధర్‌రెడ్డి చౌటుప్పల్‌లో పోలీసు బందోబస్తును, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. నాంపల్లి మండలం అడవితుమ్మలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వర్గం మద్యం పంచుతోందని పోలీసులకు సమాచారమివ్వడంతో కానిస్టేబుళ్లు వచ్చి గ్రామస్తులను చితకబాదారు.
 
  మాజీ సర్పంచి దంటిక వెంకటయ్య, గుమ్మడపు నర్సింహారావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బుధవారం ఉదయం గ్రామస్తులెవరూ ఓటేసేందుకు ముందుకు రాలేదు. సదరు కానిస్టేబుళ్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి సీఐ వెంకట్‌రెడ్డి వచ్చి కానిస్టేబుళ్లపై చర్య తీసుకుంటానని, క్షమాపణ కోరడంతో, 8.15గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
 
 దేవరకొండ
 చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 264 పోలింగ్ బూత్‌లుండగా అధికారులు సౌకర్యాలను సమకూర్చడంలో విఫలమవ్వడంతో ఓటర్లు కొంత అసౌకర్యానికి గురయ్యారు. చందంపేట మండలంలోని నేరడుగొమ్ము గ్రామపంచాయతీ పరిధిలోని చర్లతండాలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గువ్వలగుట్టలో కూడా టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. డిండి మండలం బొల్లనపల్లిలో ఇరువర్గాల మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది.
 
 కోదాడ
 నడిగూడెం మండలం సిరిపురంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కోదాడ పట్టణంతో పాటు ఐదు మండలాల్లో పోలింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. మునగాల, చిలుకూరు, కోదాడ మండలాల్లోని నాలుగు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించగా, ఆ తర్వాత వాటిని సరిచేసి ఓటింగ్‌ను నిర్వహించారు.   వేనేపల్లి చందర్‌రావు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎర్నేనిబాబు,  బొల్లం మల్లయ్యయాదవ్, పద్మావతి, జుట్టుకొండ బసవయ్యలు పట్టణంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
 
 తుంగతుర్తి
 తుంగతుర్తి నియోజకవర్గంలో ఉదయం 7గంటలకే పొలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మోత్కూరు మండలం ఆరెగూడెం, మోత్కూరు, శాలిగౌరారం మండలం చిత్తలూరు, పెర్కకొండారం, మాదారం, తుంగతుర్తి మం డలం బండరామారం, తుంగతుర్తిలలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్న సమయంలో ఎండా వేడి ఉండటంతో కేంద్రాలకు ఓటర్లు రాలేదు.  4 గంటల తర్వాత కొంతమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
 నకిరేకల్
 నకిరేకల్, కేతేపల్లి, నార్కట్‌పల్లి, రామన్నపేట, కట్టంగూర్, చిట్యాల మండలాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటల నుంచే ఓటర్లు బారులుదీరారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో  పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నకిరేకల్ మండలం గోరెంకలపల్లి, మోదినిగూడెం, మంగళపల్లి నకిరేకల్‌లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కేతేపల్లి మండల కేంద్రంలో 265 బూత్ వద్ద ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. కట్టంగూర్ మండలం అయిటిపాములలో 2గంటలు ఈవీఎంలు మొరాయించాయి. చిట్యాల మండలం ఆరెగూడెం, వనిపాకల, ఉరుమడ్లలో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్ ఆలస్యం జరిగింది. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల అమ్మనబోలు గ్రామాలలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. మొరాయించిన ఈవీఎంల స్థానంలో  కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్‌ను ప్రారంభించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన లేకపోవడంతో కొంత అయోమయానికి గురయ్యారు. పోల్ చిట్టీలు కూడా పూర్తి స్థాయిలో ఓటర్లకు చేరలేదు.
 
 సూర్యాపేట
 సూర్యాపేటలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో  పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఎండ ఎక్కువగా ఉండడంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎండలోనే నిలబడే ఓటుహక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలమర్రి గ్రామంలో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. పెన్‌పహాడ్ మండలంలోని చీదెళ్ల, అనంతారం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అధికారుల అలసత్వం వల్ల అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చివ్వెంల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో గంటన్నర సేపు ఈవీఎం మొరాయించింది.
 
 నాగార్జునసాగర్
 చెదురుమదురు సంఘటనల మినహా నియోజకవర్గంలో పొలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వ్యవసాయం, ఉపాధి హామీ పనుల కారణంగా ఉదయం పోలింగ్ మదకొడిగా సాగినా మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో రెండు చోట్ల, గుర్రంపోడు మండలం కోప్పోలు, తానేదార్‌పల్లి పెద్దవూర మండలం రామన్నగూడెం, ఏనేమిదిగూడెం, చింతపల్లి, బట్టుగూడెం, కొత్తలూరు, నిడమనూరు మండలం నారమ్మగూడెం, నిడమనూరులోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో  అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనది.
 
 హాలియా మండలం తిరుమలగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్న చింతమళ్ల శ్రీనివాస్‌పై, పేరూరులో టీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్ రామలింగయ్యపై కాంగ్రెస్ కార్యక ర్తలు దాడి చేశారు. మండలంలోని బోయగూడెం, అనుముల గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. గుర్రంపోడు మండలం చామలేడులో కాంగ్రెస్‌లోని రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. నిడమనూరు మండలం గోపాలపురం, ముకుందపురం గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
 హుజూర్‌నగర్
 హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఒకచోట ఇరువర్గాల ఘర్షణ మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఈవీఎంల మొరాయింపులతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది. హుజూర్‌నగర్  మండలంలోని గోపాలపురం, అమరవరం, నేరేడుచర్ల మండలంలోని నేరేడుచర్ల, బొత్తలపాలెం, మేళ్లచెరువు మండలంలోని తమ్మవరం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, హనుమంతులగూడెంలలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు మొరాయించి సుమారు గంట సేపు పోలింగ్ నిలిచింది. ఈవీఎంలను సరిచేసి పోలింగ్ నిర్వహించారు. మేళ్లచెరువు మండలం పీక్లానాయక్ తండా పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడి రాళ్లు రువ్వుకోగా ఇరువర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి.          
                                  
 మిర్యాలగూడ
 మిర్యాలగూడ పట్టణంలో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్పంగా తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పట్టణంలోని రెడ్డి కాలనీ, ఎన్‌ఎస్‌పీ క్యాంపు, మిర్యాలగూడ మండలంలోని సుబ్బారెడ్డిగూడెం, చింతపల్లిలో ఈవీఎంలు మోరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తెట్టెకుంటలో 8.30 గంటల సమయంలో ఈవీఎం కంట్రోల్ యూనిట్ మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేశారు. దామరచర్లలో 11.30గంటల సమయంతో  ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 15 నిమిషాల పాటు పోలింగ్ నిలిపి వేశారు. వేములపల్లి మండలంలోని ఆమనగల్లులో ఈవీఎంలు మొరాయించడంతో 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement