గెలుపు మాదే..! | First time will be Telangana party will run government | Sakshi
Sakshi News home page

గెలుపు మాదే..!

Published Sun, Apr 27 2014 3:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

First time will be Telangana party will run government

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని నిర్ణయించే పోలింగ్‌కు మరో మూడు రోజులే గడువు మిగిలింది. గెలుపుకోసం అభ్యర్థులు, వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి. తెలంగాణ వికాసమే ప్రధాన ఎజెండాగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు తమకే ఉంటుందని అన్ని పార్టీలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయావకాశాలు, ప్రచారాస్త్రాలపై ‘న్యూస్‌లైన్’ ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులను నాలుగు ప్రశ్నలు వేసింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు రెబల్స్, అసమ్మతి ప్రభావం, బీజేపీ, టీడీపీలకు పొత్తులతో లాభమా? నష్టమా? అనే ఐదో అదనపు ప్రశ్న కూడా వేసింది. ఆయా పార్టీల అధ్యక్షులు ఇచ్చిన సమాధానాలివి.                                 
 - న్యూస్‌లైన్, కరీంనగర్ సిటీ
 
 1.ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏమిటి? విజయావకాశాలెలా ఉన్నాయి?
 2.ఎన్ని స్థానాల్లో గెలుస్తారు?
 3.ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి?
 4.ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ ప్రచారాస్త్రాలేమిటి?
 5.రెబల్స్, అసమ్మతి నేతల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? (కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు)
 6.పొత్తుతో లాభమా? నష్టమా? (టీడీపీ, బీజేపీలకు)
 
 జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఒకటి రెండు సీట్లు అటు, ఇటు ఉన్నా, పరిస్థితి పూర్తిగా మాకు అనుకూలంగా ఉంది. మూడు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తాం.
 
 ప్రజల చిరకాల కోరిక, 60 ఏళ్ల బతుకు పోరాటానికి సార్థకత చేకూరుస్తూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు.
 
 టీడీపీ, బీజేపీలను ప్రత్యర్థులుగా గుర్తించడం లేదు. టీఆర్‌ఎస్‌తోనే మా పోటీ. కేసీఆర్ కుటుంబం, అనుచరుల కోసమే టీఆర్‌ఎస్ పార్టీ పెట్టాడు తప్ప ప్రజల కోసం కాదు. పవిత్రమైన తెలంగాణ ఉద్యమం పేరుతో నాటకాలాడిన కే సీఆర్‌ను ప్రజలు విశ్వసించరు.
 
 గత ప్రభుత్వాల వైఫల్యాలు, కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ సాధించాం, సాధించిన తెలంగాణను అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే అనే అంశాలను ప్రజల ముందుంచుతాం.రెబల్స్, అసమ్మతి నేతల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆధారపడే పార్టీ కాదు. ఒక్కరు వెళ్లినా, వ్యతిరేకంగా పనిచేసినా నష్టముండదు. జాతీయస్థాయి నాయకులని భావించిన వారు కూడా పార్టీని వీడిన తర్వాత జీరో అయ్యారు.
 
 ఈద శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
 అన్ని పార్టీలక న్నా టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. మూడు ఎంపీ స్థానాలతోపాటు 11 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుంది.14 ఏళ్ల టీఆర్‌ఎస్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్ చేతిలోనే పునర్నిర్మాణ బాధ్యత పెట్టాలని ప్రజలు భావిస్తున్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోషించింది మంత్రసాని పాత్ర మాత్రమే. ఎక్కడైనా పుట్టిన బిడ్డ తల్లికి చెందుతుంది తప్ప మంత్రసానికి కాదు. బిడ్డ బాగుండాలంటే తల్లి లాలనలోనే పెరగాలి. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌తోనే పునర్నిర్మాణం సాధ్యమనే ప్రచారంతో ముందుకుపోతున్నాం.రెబల్స్ కూడా మొన్నటి వరకు పార్టీలో ఉండి ఉద్యమం చేసిన వాళ్లే కావడంతో ప్రభావం సహజంగానే పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని స్థానాల్లో మెజారిటీ కాస్త తగ్గుతుందంతే. సీనియర్లు, ఉద్యమకారులను, అసంతృప్తులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.
 
 మీస అర్జున్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 జిల్లాలో మా పార్టీ పరిస్థితి బాగుంది. మోడీ హవా ఉంది. కరీంనగర్ ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తు న్నాం. మెజారిటీ తగ్గినా అన్నింట్లో విజయం సాధిస్తాం.
 
 ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నపుడు ధరలు నియంత్రణలో ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ధరలు విపరీతంగా పెరగడంతోపాటు అవినీతి తాండవిస్తోంది. బీజేపీ పాలన మెరుగ్గా ఉన్నందున ప్రజలు మా వైపే మొగ్గుచూపుతున్నారు.
 
 ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్ మోడీని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ చేసిన పనిని ఇప్పుడు టీఆర్‌ఎస్ ఎత్తుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఎంతో ఉంది. కాంగ్రెస్ పాలన తో అభివృద్ధి పదేళ్లు వెనకబడింది. బీజేపీతోనే సమర్థపాలన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
 
 కొన్ని స్థానాల్లో టీడీపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేదనే అభిప్రాయం ఉంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. టీడీపీకున్న ఓటు బ్యాంకు మాకు లాభం చేకూరుస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement