ఆ క్షణాలు వచ్చేశాయి. అన్ని పక్షాలూ ఇప్పుడు ఉత్కంఠతో ఓటరు తీర్పు ఎలా ఉంటుందా అని ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికలకు కావల్సిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పటిష్టంగా చేసింది. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగు కేంద్రాలకు మంగళవారం సాయంత్రానికే చేరుకున్నారు. నేతలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అంతర్గత ప్రణాళికలు రచించి నమ్మకస్తుల ద్వారా అమలు పరుస్తున్నారు. తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలక ఘట్టం బుధవారం ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కానుంది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 28.94లక్షల మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డిన పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠ ఎదుర్కొంటున్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కంటి మీద కునుకులేకుండా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలింగ్ సిబ్బంది మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నారు.
ర్యాండమైజేషన్‌లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రిని సరిచూసుకున్నారు. అధికారులు సమకూర్చిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి బుధవారం ఉదయం జరిగే పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. సుమారు 24, 806 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. బందోబస్తులో భా గంగా 16వేలకు పైగా పోలీసు సిబ్బంది వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ప్రత్యేక బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు.
ప్రలోభాల పర్వంలో పార్టీలు బిజీ
కొద్ది గంటల్లో పోలింగ్ మొదలు కానుండటంతో పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం చివరి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల సంఘం కళ్లుగప్పి గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా మద్యం, నగదు ప్రవాహం జోరుగా సాగుతోంది. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాల పర్వంపై దృష్టి సారించారు.
అభ్యర్థులు ఎవరికి చిక్కకుండా గ్రామాల్లో పర్యటిస్తూ కుల సంఘాలు, యువజన సంఘాలు లక్ష్యంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎదుటి పార్టీ ముఖ్య నేతలు, కేడర్, పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఓటింగ్‌ను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. పలు చోట్ల మద్యం నిల్వలు పట్టుబడగా, స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎదుటి పార్టీలు ప్రలోభాలకు ప్రయత్నిస్తోందంటూ అందుతున్న పిర్యాదుతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది.
నేడు..‘నిర్ణయం’
Published Wed, Apr 30 2014 3:16 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement