‘వీవీప్యాట్’ను రూపొందించిన ఈసీఐఎల్
* ఈవీఎంలతో పాటు పక్కనే వీవీప్యాట్ పరికరాల ఏర్పాటు
* ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగం
* ఓటింగ్‌లో పారదర్శకత దిశగా ఈసీ తొలిమెట్టు
* వీవీప్యాట్ పనితీరును వివరించిన ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికల ప్రకియ జరిగేలా.. ఓటరు సంతృప్తి చెందేలా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) ప్రింటింగ్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) రూపొందించింది.
శుక్రవారం ఈసీఐఎల్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పి.సుధాకర్ వీవీప్యాట్ పనితీరును మీడియాకు వివరించారు. ఇటీవల ఓటర్లు తాను ఓటు వేసిన అభ్యర్థికే ఓటు నమోదైందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిని నివృత్తి చేసేందుకే వీవీప్యాట్‌ను రూపొందించామని తెలిపారు. దీనిని ఓటింగ్ యంత్రంతో పాటు ఉంచుతామని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరంలోని స్క్రీన్‌పై కొన్ని క్షణాల పాటు కనిపిస్తుందని, ఆ వివరాలు ప్రింట్ మాదిరిగా అందులోనే నిక్షిప్తమవుతాయని వివరించారు.
దీనివల్ల ఓటరుకు తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థికే ఓటు వేశానన్న సంతృప్తి కలగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తినా మ్యానువల్‌గా ఓట్లను లెక్కించే సౌలభ్యం ఉంటుందన్నారు. ఒక్కో యంత్రం లో 1,500 ఓట్లను నమోదు చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల.. బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు తెలిపారు. తాజాగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వీటిని వినియోగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని, ఇప్పటికే 40కిపైగా వీవీప్యాట్ యంత్రాలను ఖమ్మం పంపించామని చెప్పా రు.
2019 సాధారణ ఎన్నికలకల్లా దేశవ్యాప్తంగా వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని, కొన్ని పరికరాలను అమర్చితే ట్యాంపరింగ్ చేయవచ్చనేది అపోహ మాత్రమే అని సుధాకర్ స్పష్టం చేశారు. అనేక రకాల సందేహాలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని నివృత్తి చేస్తూ వస్తున్నామని, ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వీవీప్యాట్ దోహదపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరక్టర్ ఫైనాన్స్ కిశోర్ రుంగ్టా, డైరక్టర్ పర్సనల్ వీఎస్ బంగారుబాబు, ఈవీఎం డివిజన్ హెడ్ మహేంద్రన్, ఇన్స్‌ట్రుమెంట్ డివిజన్ జీఎం అనురాగ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.