ఈవీఎంలు మళ్లీ వివాదాస్పదమౌతాయా?
ఈవీఎంల పనితీరు విషయంలో తొలినుంచీ ఎన్నో ప్రశ్నచిహ్నాలున్నాయి. ఈవీఎంలో ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని పలువురు వాదిస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా ఒక పార్టీకే పడేలా చేయవచ్చునని కూడా వాదనలున్నాయి.
2009 లోకసభ ఎన్నికల సమయంలో ఈవీఎంల సామర్థ్యం విషయంలో చాలా వివాదాలు చెలరేగాయి. అయితే ఈ సారి ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
2009 లో చెలరేగిన వివాదాల కారణంగా ఓటు వేసిన తరువాత ఓటరుకు తానే పార్టీకి లేదా అభ్యర్థికి ఓటేశారో తెలియచేసే ఒక రసీదు పత్రాన్ని ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ పత్రాన్ని వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ లేదా వీవీపీఏటీ అని అంటారు. అయితే ఈ సారి చాలా నియోజకవర్గాల్లో ఈ పత్రాన్ని ఇవ్వడం లేదు. దీనితో ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీలు ఎన్నికలపై సవాళ్లు లేవనెత్తే అవకాశాలున్నాయి.
వీవీపీఏటీ పత్రాన్ని ఇవ్వాలంటే ఈవీఎంను ఒక ప్రింటర్ కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ఈవీఎంలకూ ఈ ప్రింటర్లను కనెక్ట్ చేయాలి. ఈ ప్రతిపాదనలను గతేడాది ఫిబ్రవరిలో ఆమోదించారు. ఇందుకు దాదాపు పధ్నాలుగు లక్షల ప్రింటర్లు అవసరం అవుతాయి. దీని కోసం 1860 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ నిధిని ప్రభుత్వం విడుదల చేయలేదు.
అలాగే చాలా చోట్ల ఎన్నికలు లేనప్పుడు ఈ ఈవీఎంలను ఆరుబయటే ఉంచడం జరుగుతుంది. మళ్లీ వాడేటప్పుడు ఆ యంత్రాల్లోని చిప్ లను మార్చినట్టయితే ఇతరులెవరూ యంత్రంలో మార్పులు చేయడానికి వీలుండదు. అయితే ఒక చిప్ కి వంద రూపాయలు ఖర్చవుతుంది. దీనికి కూడా నిధులు లేకపోవడంతో చిప్ ను మార్చడం లేదు. ఫలితంగా ఈవీఎంలను తమకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడానికి అధికార పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేయడానికి, మోసాలకు పాల్పడటానికి వీలుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమీషన్ డీఆర్ డీఓ కి చెందిన ప్రొఫెసర్ ఎస్ సంపత్, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ డా. ఇందిరేశన్, ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ డా. సి రావ్ కాసరబాదాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈవీఎంలను గట్టిగా వెనకేసుకొచ్చింది.
అయినప్పటికీ ఆరోపణలు ఆగడం లేదు. ఈ సారి వీవీపీఏటీ పత్రాలు ఇవ్వకపోతే ఆరోపణలు మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది.