కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : భారత ఎన్నికల సంఘం ఓటింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇందువల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కొన్ని మార్పులు సంభవించనున్నాయి. ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ (వీవీపీఏటీ) సిస్టమ్ ఇందులో ఒకటి. బ్యాలెట్ పేపర్ల పద్దతి అమలులో ఉన్నప్పుడు తాను అనుకున్న అభ్యర్థికే ఓటు వేశామనే విషయం ఓటరుకు ఇట్టే తెలిసేది.
కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాక తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్నది ఓటరుకు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే ఈవీఎం విధానంలో పారదర్శకత లోపించింది. ఈవీఎంల ద్వారా గోల్‌మాల్‌కు అవకాశాలున్నాయని వివిధ రాజకీయ పార్టీలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ అనే సామాజిక కార్యకర్త డెమో ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు.
ఇది అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈసీఐ రాజకీయ పక్షాలతో చర్చలు నిర్వహించింది. ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్ అమర్చాలని పలు పార్టీలు సూచించాయి. ఆ తర్వాత ఆ విషయం కొంతకాలం మరుగున పడింది. వివాదాలకు ఆస్కారం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ పద్దతిని అమలు చేయాలంటూ అక్టోబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫేజ్డ్ మ్యానర్‌లో ఈవీఎంలకు వివిపిఏటి పద్దతిని అనుసంధానించాలని పేర్కొంది. 2014లో జరుగనున్న సాధారణ ఎన్నికల నాటికి ఈ పద్దతి అమలులోకి రావాలని స్పష్టంచేసింది.
ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ విధానంలో మార్పులకు చర్యలు చేపట్టింది. వివిపిఏటి పద్దతి వల్ల తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న విషయం ఓటరు తెలుసుకోవడానికి వీలుగా ఒక ప్రింట్ అవుట్ బయటకు వస్తుంది. ఈ పద్దతిని అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు పంపాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఈసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. పిఆర్‌సి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లాలో పర్యటించి వెళ్లారు.
జిల్లాలోని 7,487 బ్యాలెట్ యూనిట్లు, 6,831 కంట్రోల్ యూనిట్లను వీరు త్వరలోనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నుంచి జిల్లాకు త్వరలో 6వేల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. జిల్లాలో 2,491 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కొత్త పద్ధతి గురించి అధికారులు, ఓటర్లకు డెమో నిర్వహించేందుకు 120 ఈవీఎంలు అదనంగా రానున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి పది చొప్పున వీటిని కేటాయించనున్నారు. డెమో కోసం తీసుకురానున్న వీటిని పోలింగ్ సమయాల్లో ఉపయోగించరు.
‘నోటా’మీటల ఏర్పాటు :
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా నేరచరితులైనప్పటికీ లేదా తనకు నచ్చకపోయినప్పటికీ ఎవరో ఒకరికీ ఓటు వేయాల్సివస్తోంది. అభ్యర్థులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసేందుకు ఓటరుకు అవకాశం ఉండాలని వివిధ పౌర సంఘాలు, మేధావులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘నన్ ఆఫ్ ది అబౌ’ (నోటా) మీటను ఈవీఎంలలో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అంటే ఇకపై ఓటరుకు అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఈవీఎంలో చిట్ట చివర ఉన్న మీటను నొక్కితే సరిపోతుంది. అయితే ఈ అభిప్రాయాలను ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోరు. ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే గెలుపొందినట్లు ప్రకటిస్తారు.
యువత నమోదుపై ప్రత్యేక శ్రద్ధ
యువతను అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. 2014 జనవరి 1వ తేదికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు చర్యలు చేపడుతున్నారు. జనాభా గణాంకాల ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన యువత 1,12,915 మంది ఉన్నారు. ఇందులో కేవలం 49,155 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు.
మిగిలిన వారిని కూడా నమోదు చేసేందుకు అధికారులు కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. కళాశాలల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్లుగా నియమించనున్నారు. ఓటర్ల నమోదుకు సహకరించినందుకుగానూ వీరికి రూ.2వేలు రెమ్యునరేషన్‌గా ఇవ్వనున్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు ఈసీఐ జిల్లాకు 17వేల ప్యాకెట్ క్యాలెండర్లను పంపింది. ఓటరు నమోదు ఫారాలను పూరించడం లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఈ క్యాలెండర్లలో వివరించారు. అలాగే 11వేల వాల్‌పోస్టర్లు జిల్లాకు అందాయి. కొత్త ఓటర్లకు జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలర్ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు.
ఓటింగ్‌లో పారదర్శకతకు చర్యలు
Published Sat, Nov 30 2013 3:21 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement