printing machine
-
దోస ప్రింటింగ్ మెషీన్ : వైరల్ వీడియో
‘దోసెలందు డెస్క్‌టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్‌బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్‌తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్‌తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్‌తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్లోని ఐరన్ ప్లేట్‌పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7— anand mahindra (@anandmahindra) November 14, 2024 ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది. కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే. -
ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా !
మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్‌బుక్‌ను ప్రింట్ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్‌బుక్ ప్రింటింగ్ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు. గురువారం ఉదయం తెరిచి చూసిన సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.! -
భాగ్యనగరంలో మింట్ మ్యూజియం..దేశంలోనే తొలిసారిగా..!
సాక్షి, హైదరాబాద్: నాణేలు ఎలా తయారవుతాయి.. నోట్ల ముద్రణ ఎలా జరుగుతుంది.. ఆ యంత్రాలెలా ఉంటాయి.. ఈ విషయాలు అందరికీ ఆసక్తికరమే. మరి నోట్ల ముద్రణను స్వయంగా చూడగలిగితే.. బాగుంటుంది కదా.. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ అవకాశం కలగనుంది. మన దేశంలో ప్రస్తుతం నోట్లు, నాణేలు ముద్రించే కీలక మింట్లలో ఒకటి చర్లపల్లిలో ఉన్న హైదరాబాద్ మింట్. దానికన్నా ముందు నిజాం హయాంలోనే హైదరాబాద్‌లో నోట్లు ముద్రించిన మింట్ సైఫాబాద్‌లో నేటికీ పదిలంగా నిలిచి ఉంది. వందేళ్ల కంటే పూర్వం నాటి యంత్రాలతో కూడిన ఆ భవనంలోనే ‘మింట్ మ్యూజియం’ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)’ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా వచ్చేనెల రెండో వారంలో సైఫాబాద్ మింట్ భవనంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చే పని ప్రారంభం కానుంది. ఇక్కడి పురాతన యంత్రాలను పునరుద్ధరించే కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఎగ్జిబిషన్ కోసం ‘ఇంటాక్’ హైదరాబాద్ చాప్టర్ సహకారంతో పనులు మొదలయ్యాయి. వందేళ్లకు పైబడి కరెన్సీని ముద్రించిన మింట్‌ను మ్యూజియంగా మార్చుతుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నిజాం హయాంలో.. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం రాజులు సొంతంగా నాణాలు ముద్రించుకోవడం కోసం మింట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడో నిజాం నవాబ్ సికిందర్జా 1803లో రాయల్ మింట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో ఏర్పాటైన ఆ మింట్‌లో.. నిజాం సంస్థానం సొంత నాణేలు తయారయ్యేవి. వాటిని చేతితో రూపొందించేవారు. 1857 తొలి స్వాతంత్య్ర పోరాటం తర్వాత దేశంలోని కొన్ని ముఖ్యమైన మింట్లు మినహా మిగతావాటిని బ్రిటిష్ ప్రభుత్వం మూసేసింది. ముంబై, కోల్‌కతాల్లో రెండు ఆధునిక మింట్లను ఏర్పాటు చేసింది. వాటిలో పూర్తిగా యంత్రాలతో నాణేలు, నోట్లు ముద్రించేవారు. ఆరో నిజాం తమ మింట్‌లో కూడా యంత్రాలతో ముద్రణ జరగాలని భావించి.. 1895లో లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. వాటితో చర్కి (చర్కా) నాణేల ముద్రణ మొదలైంది. పూర్తిస్థాయిలో ఆధునీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్ల తరహాలో పూర్తి ఆధునిక పద్ధతుల్లో నాణేలు ముద్రించే కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి.. నోట్ల ముద్రణ కూడా ప్రారంభించారు. నాణేలతోపాటు రూ.1,000, రూ.100, రూ.10, రూ.5 పేపర్ కరెన్సీని, స్టాంపు పేపర్లను కూడా ముద్రించారు. తర్వాత మెడల్స్, బ్యాడ్జెస్, ఇతర జ్ఞాపికలు కూడా రూపొందించేవారు. -
యూట్యూబ్ చూసి దొంగనోట్లు తయారీ.. చికెన్ పకోడి పట్టిచ్చింది
సాక్షి,గుంతకల్లు( అనంతపురం): యూట్యూబ్‌లో చూసి గుంతకల్లు కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చలా మణి చేసిన ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు. పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబులు అప్రమత్తమై నూర్‌బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ.వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది. దీంతో నూర్‌బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో దొంగనోట్ల తయారీ గుట్టు రట్టయింది. యూట్యూబ్ ద్వారా నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ.50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను అందజేయడంతో పాటు స్వయంగా తాము కూడా మార్కెట్లో చలామణి చేసినట్లు తెలిపాడు. ప్రింటర్, జిరాక్స్ మిషన్లు స్వాధీనం శనివారం రాత్రి నిందితుడు నూర్‌బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి జొన్నగిరి పోలీసులు చేరుకున్నారు. అతని ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నూర్‌బాషాకు సహకరించిన ఖాజా, ఎన్.ఖాసీంను అరెస్ట్ చేసి సోమవారం కర్నూలు జిల్లా కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు. చదవండి: దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. -
ఓటింగ్‌లో పారదర్శకతకు చర్యలు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : భారత ఎన్నికల సంఘం ఓటింగ్ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇందువల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కొన్ని మార్పులు సంభవించనున్నాయి. ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ (వీవీపీఏటీ) సిస్టమ్ ఇందులో ఒకటి. బ్యాలెట్ పేపర్ల పద్దతి అమలులో ఉన్నప్పుడు తాను అనుకున్న అభ్యర్థికే ఓటు వేశామనే విషయం ఓటరుకు ఇట్టే తెలిసేది. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాక తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్నది ఓటరుకు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే ఈవీఎం విధానంలో పారదర్శకత లోపించింది. ఈవీఎంల ద్వారా గోల్‌మాల్‌కు అవకాశాలున్నాయని వివిధ రాజకీయ పార్టీలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ అనే సామాజిక కార్యకర్త డెమో ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఇది అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈసీఐ రాజకీయ పక్షాలతో చర్చలు నిర్వహించింది. ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్ అమర్చాలని పలు పార్టీలు సూచించాయి. ఆ తర్వాత ఆ విషయం కొంతకాలం మరుగున పడింది. వివాదాలకు ఆస్కారం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఓటర్ వెరిఫైర్ పేపర్ ఆడిట్ ట్రైయిల్ పద్దతిని అమలు చేయాలంటూ అక్టోబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫేజ్డ్ మ్యానర్‌లో ఈవీఎంలకు వివిపిఏటి పద్దతిని అనుసంధానించాలని పేర్కొంది. 2014లో జరుగనున్న సాధారణ ఎన్నికల నాటికి ఈ పద్దతి అమలులోకి రావాలని స్పష్టంచేసింది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. దీంతో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ విధానంలో మార్పులకు చర్యలు చేపట్టింది. వివిపిఏటి పద్దతి వల్ల తాను వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న విషయం ఓటరు తెలుసుకోవడానికి వీలుగా ఒక ప్రింట్ అవుట్ బయటకు వస్తుంది. ఈ పద్దతిని అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు పంపాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఈసీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. పిఆర్సి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లాలో పర్యటించి వెళ్లారు. జిల్లాలోని 7,487 బ్యాలెట్ యూనిట్లు, 6,831 కంట్రోల్ యూనిట్లను వీరు త్వరలోనే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నుంచి జిల్లాకు త్వరలో 6వేల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రానున్నాయి. జిల్లాలో 2,491 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కొత్త పద్ధతి గురించి అధికారులు, ఓటర్లకు డెమో నిర్వహించేందుకు 120 ఈవీఎంలు అదనంగా రానున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి పది చొప్పున వీటిని కేటాయించనున్నారు. డెమో కోసం తీసుకురానున్న వీటిని పోలింగ్ సమయాల్లో ఉపయోగించరు. ‘నోటా’మీటల ఏర్పాటు : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులంతా నేరచరితులైనప్పటికీ లేదా తనకు నచ్చకపోయినప్పటికీ ఎవరో ఒకరికీ ఓటు వేయాల్సివస్తోంది. అభ్యర్థులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసేందుకు ఓటరుకు అవకాశం ఉండాలని వివిధ పౌర సంఘాలు, మేధావులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘నన్ ఆఫ్ ది అబౌ’ (నోటా) మీటను ఈవీఎంలలో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అంటే ఇకపై ఓటరుకు అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఈవీఎంలో చిట్ట చివర ఉన్న మీటను నొక్కితే సరిపోతుంది. అయితే ఈ అభిప్రాయాలను ఓట్ల లెక్కింపులో పరిగణలోకి తీసుకోరు. ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే గెలుపొందినట్లు ప్రకటిస్తారు. యువత నమోదుపై ప్రత్యేక శ్రద్ధ యువతను అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. 2014 జనవరి 1వ తేదికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు చర్యలు చేపడుతున్నారు. జనాభా గణాంకాల ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన యువత 1,12,915 మంది ఉన్నారు. ఇందులో కేవలం 49,155 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన వారిని కూడా నమోదు చేసేందుకు అధికారులు కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. కళాశాలల్లో ఎంపిక చేసిన కొందరు విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్లుగా నియమించనున్నారు. ఓటర్ల నమోదుకు సహకరించినందుకుగానూ వీరికి రూ.2వేలు రెమ్యునరేషన్‌గా ఇవ్వనున్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు ఈసీఐ జిల్లాకు 17వేల ప్యాకెట్ క్యాలెండర్లను పంపింది. ఓటరు నమోదు ఫారాలను పూరించడం లేదా ఆన్లైన్లో దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఈ క్యాలెండర్లలో వివరించారు. అలాగే 11వేల వాల్‌పోస్టర్లు జిల్లాకు అందాయి. కొత్త ఓటర్లకు జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలర్ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు.