సాక్షి, మెదక్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ తెలంగాణలో వీవీ పాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై కాంగ్రెస్ సహా పలు పార్టీ అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ–పీఏటీ) యంత్రాల వాడకం ద్వారా ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఈవీఎంల వాడకంపై మరింత నమ్మకం పెరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, డీఆర్‌ఓ స్థాయి అధికారులకు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ–పీఏటీ) ఈవీఎంల వాడకంపై శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, డీఆర్‌వోలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు వాటి ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. వీవీ–పీఏటీ యంత్రాల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికలు జరిగిన పక్షంలో ఈ రకమైన కొత్త ఈవీఎంలు వాడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎన్ని అవసరం అవుతాయో జిల్లాల వారీగా ఈసీ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వీవీ–పీఏటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీ బాధ్యతను ఈసీఐఎల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈవీఎంలపై నమ్మకం పెరిగేలా చర్యలు..
ఈవీఎంలపై ఓటర్లకు, రాజకీయపార్టీలకు మరింత నమ్మకం పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది. ఈవీఎంలు హ్యాక్ చేయకుండా చర్యలు తీసుకుంది. ఈవీఎంలకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నష్టంచేయాలని ప్రయత్నిస్తే ఈవీఎం ఆటోమేటిక్‌గా సేఫ్ మోడ్‌లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంది.
ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసింది స్పష్టంగా తెలుసుకునేందుకు వీవీ–పీఏటీని ఈసీ రూపొందించింది. బ్యాలెట్ యూనిట్‌లో ఓటు వేసిన వెంటనే ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేసింది వీవీ–పాట్ యంత్రం ఓటింగ్ స్లిప్‌ను ముద్రిస్తుంది. ఈ స్లిప్‌ని వీవీ–పాట్ యంత్రంలోని గ్లాస్ డిస్‌ప్లేలో ఓటరు స్పష్టంగా చూడవచ్చు. ఓటింగ్ స్లిప్ ఏడు సెకండ్లపాటు మాత్రమే ఉంటుంది. ఓటును ఈవీఎం ద్వారా టాంపరింగ్ చేసేందుకు వీలు పడదు.
Comments
Please login to add a commentAdd a comment