సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశమున్నవారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా? – రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. లోక్‌సభకు పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది సీనియర్లు ఈసారి లోక్‌సభకు పోటీచేయాలనే ఆలోచనలో ఉండటం, తమకు అవకాశమివ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
బహిరంగంగా కొందరు.. అంతర్గతంగా మరికొందరు..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చాలా మంది సీనియర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మహామహులనుకున్న కాంగ్రెస్ నేతలు సైతం ఓటమి పాలుకావడం ఆ పార్టీ కేడర్‌ను కుంగదీసింది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంతో పాటు కేడర్‌లో మనోస్థైర్యం నింపాలంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ఒక్కటే మార్గమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. వీరిలో కొందరు తాము లోక్‌సభకు పోటీచేస్తామని బహిరంగంగానే చెబుతూ దరఖాస్తు చేసుకోగా, మరికొందరు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విషయం చెప్పిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా అదే మాట చెప్పారు. చెప్పడమే కాదు.. తనకు నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాలంటూ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ఛరిష్మాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తున్నారు. నల్లగొండ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడనుంది. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిల పేర్లు కూడా వినిపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ సీనియర్లు టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపిక సంచలనాత్మకమవుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, అరుణలలో ఎవరైనా టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలే రేసులో ఉన్నారు. వీరి విషయంలో హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుందా..? కనీసం ఒకరిద్దరికైనా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకునే అవకాశం ఇస్తుందా..? లేదా మూకుమ్మడిగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే...!
నెలాఖరుకు ఎంపిక
లోక్‌సభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈనెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పంపనున్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు పేర్లు మాత్రమే హైకమాండ్‌కు పంపుతారని, అనివార్యమైతేనే మూడోపేరు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. పీఈసీ సమావేశం అనంతరం 20వ తేదీ లోపు అభ్యర్థుల జాబితా అధిష్టానానికి వెళుతుందని, నెలాఖరుకల్లా అభ్యర్థుల అధికారిక ప్రకటన ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
ఓడినవారికి వచ్చేనా?
Published Wed, Feb 13 2019 3:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment