ఈవీఎంలు సిద్ధం
కుషాయిగూడ: గ్రేటర్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్(ఈవీఎం)లను సిద్ధం చేసినట్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం విదితమే. 7,790 పోలింగ్ కేంద్రాలకు గాను 9,370 ఈవీఎంలు సిద్ధం చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఇప్పటికే పూర్తైట్లు తెలిపారు.
ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఆపేక్స్ లెవల్ అధికారితో పాటు అనుభవం ఉన్న ఆఫీసర్, ఐదు సర్కిళ్ల చొప్పున ఒక సీనియర్ అధికారి, ప్రతి డివిజన్‌కు అనుభవజ్ఞులైన ఇద్దరు ఇంజినీర్లను నియమించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఈసీఐఎల్ ప్రస్థానంలో ఈవీఎంల రూపకల్పన మైలురాయిగా మిగిలిపోతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.