జనం భాగస్వామ్యం పెరగాలి
Published Mon, Jan 27 2014 1:18 AM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం పెరిగితేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. ఈ దిశగా ముందడుగు వేయడానికి సోషల్ ఆడిట్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత సైనిక, పోలీసు దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రగతిని వివరించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విధంగానే విశాఖపట్నంలోనూ త్వరలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటుకానుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ‘ఫాస్ట్ ట్రాక్’ విధానంలో అనుమతులు లభిస్తాయన్నారు. ‘విశాఖపట్నం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ను సూపర్ స్పెషాలిటీ వైద్య రంగంలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రారంభంలో, చివరలో ఆయన తెలుగులో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ మనోహర్, పలువురు మంత్రులు, అధికారులు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కన్నులపండువగా వేడుకలు
గణతంత్ర వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. 19 కంటింజెంట్లు మార్చ్‌ఫాస్ట్ చేశాయి. మార్చ్‌ఫాస్ట్‌లో సీనియర్ విభాగంలో ఈఎంసీ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ సెంటర్) బృందం మొదటి బహుమతి, ఆర్టిలరీ సెంటర్ రెండో బహుమతి పొందాయి. జూనియర్ విభాగంలో ఎన్‌సీసీ బాయ్స్‌కు, ఎన్‌సీసీ గర్ల్స్‌కు ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చాయి.
జడ్జిల సంఖ్య పెంపునకు కేంద్రం ఓకే: సీజే
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా తెలిపారు. ప్రస్తుతం 49 మంది జడ్జిలు ఉండగా 61కి పెంచేందుకు కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే అంగీకారం తెలియచేసిందన్నారు. హైకోర్టులో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. హైకోర్టు జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, రిజిస్ట్రార్లు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు, పలువురు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు.
Advertisement
Advertisement