గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ నిర్వహించాలి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్‌కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్‌కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.
ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలి
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు.
కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment