ఆడిట్ దడ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రక్షాళన మొదలైంది. డ్వామా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పథకం పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే వీటిపై అధికారులు పలు దఫాలుగా విచారణ చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉపాధిహామీ పథకం అమలులో కీలకపాత్ర వహించే క్షేత్రస్థాయి ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు సోషల్ ఆడిట్‌లోనిర్దారణయింది. దుర్వినియోగమైన సొమ్మును అక్రమార్కుల నుంచి కక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2007 నుంచి జిల్లాలో ఈ పథకం అమలులో ఉంది. నాటి నుంచి అక్రమాలు కోకొల్లలుగా చోటుచేసుకుంటున్నాయి. కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం మేల్కోవడంతో కొంతమేరకైనా అవినీతికి అడ్డుకట్టపడినట్టే.
సోషల్‌ఆడిట్‌తో అక్రమాలకు చెక్
ప్రభుత్వ సొమ్ము నిజమైన కూలీలకు చెందకుండా దళారీలు, చేతివాటం ప్రదర్శించే ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రక్రియకు కళ్లెం వేసేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోషల్‌ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఉపాధిహామీలో అక్రమాలను వె లుగులోకి తెస్తున్నారు. చేయని పనిని చేసినట్లుగా చూపించటం, పనుల కొలతత్లో హెచ్చుతగ్గులు, కూలీలు ఎక్కువ పనిదినాలు చేసినట్లు చూపడం, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికన్నా ఎక్కువ మందిని కంప్యూటర్లలో నమోదు చేయడం, పని ప్రారంభం కాకుండానే మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చినట్లుగా చూపించడం వంటి అక్రమాలపై అధికారులు సోషల్ ఆడిట్‌లో నిగ్గుతేల్చారు.
జిల్లాలో ఈ తరహా అక్రమాలకు పాల్పడిన నలుగురు ఎంపీడీవోలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు సైతం వేసింది. వీరు తిరిగి ఉద్యోగాలు పొందగలిగినా వీటికి సంబంధించిన కేసుల విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ పథకంలో అవకతవకలకు పాల్పడినట్లు పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు 144 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లు, 22 మంది టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల్లో నుంచి తొలగించింది.
సత్ఫలితాలిస్తున్న చర్యలు
ఉపాధిహామీ పథకంలో మార్పులు తేవడంతోపాటు ఉద్యోగుల్లో అంకితభావాన్ని పెంచేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో జరిగిన అవకతవకలపై మాత్రం అధికారులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. పథకం అమలునాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రెండు కోట్ల రెండు లక్షల ఆరువేల రూపాయలు దుర్వినియోగం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఉపాధి హామీ పథకం అమలులో భాగస్వామ్యులైన వివిధ విభాగాల ఉద్యోగుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ఇప్పటికే రూ.83.33 లక్షలు రివకరీ చేశారు.
ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిలో అంకితభావం, హామీ పథకం లక్ష్యాల ను వివరించటం, ఉపాధి కోసం కూలీలు పడుతున్న ఇబ్బందిని పరిగణలోకి తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి డ్వామా అధికారులు ఉద్బోధిస్తున్నారు. ఇంకా వసూలు కావాల్సిన దాదాపు రూ.1.18 కోట్లపై సైతం అధికారులు దృష్టి సారించారు. భవిష్యత్తులో ఈ పథకంలో అక్రమాలు చోటు చేసుకోకుండా చూసేందుకు అధికారులు పలు పద్ధతులను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం చండ్రుగొండలో ఏపీవో పేరుతో ఒక క్షేత్రస్థాయి ఉద్యోగి చెక్‌ను ఫోర్జరీ చేశాడు. రూ.4.15 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఈ తరహా అక్రమాలు జరగకుండా మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
రికవరీపై మరింత దృష్టి
ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకలపై డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారి నుంచి తిరిగి రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ పథకం అమలును వేగవంతం చేస్తున్నామన్నారు. అందరికీ ఉపాధి లభించేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.