సోషల్ ఆడిట్ సిబ్బంది నిర్బంధం
ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్
అవకతవకలు వెలికి తీయూలని ఆందోళన
మహబూబాబాద్ రూరల్ : ఉపాధి హామీ పథకం అమలుపై సామాజిక తనిఖీ కోసం వచ్చిన సిబ్బందిని మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామస్తులు, ఉపాధి కూలీలు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్బంధించారు. ఉపాధి పనులు కల్పించాలని, గతంలో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఆందోళన చేపట్టారు. వారికి సర్పంచ్ గద్దపాటి సంతోష్, వార్డు సభ్యులు మద్దతు పలికారు. గత ఏడాది ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై గ్రామసభ పెట్టి సామాజిక తనిఖీ నిర్వహించేందుకు సోషల్ ఆడిట్ సభ్యులు మురళి, ఆరిఫ్, వినాయక్ కుమార్, నరేశ్, డీఆర్పీ రవి, టీఏ డి.సంతోష్ గ్రామపంచాయతీ కార్యాలయూనికి చేరుకున్నారు. వారితోపాటు అక్కడే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ షైనాబీని గ్రామస్తులు, ఉపాధి కూలీలు గ్రామపంచాయతీలో బంధించి గేటుకు తాళం వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గతంలో బేతోలు గ్రామానికి రూ.30 లక్షల ఉపాధి హామీ పనులను కేటాయించారని, ఇందులో రూ.5 లక్షల పనులు మాత్రమే చేయించారని, కూలీలకు వేతనాలు కూడా చెల్లించలేదన్నారు.
కురవి పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడుతుండగానే మానుకోట ఇన్‌చార్జి ఎంపీడీఓ జి.రవీందర్, ఉపాధి హామీ ఏపీఓ విజయ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మిగతా రూ.25 లక్షల ఉపాధి పనులను గ్రామానికి కేటాయిస్తామని, గతంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఆందోళనలో వార్డు సభ్యులు ఖాదర్‌బాబు, గంగుల శ్రీను, జినుక ఎల్లయ్య, రవీందర్‌రావు, గ్రామస్తులు కిషన్, లక్ష్మయ్య, చేసం చిలుకమ్మ, సగరం పద్మ, ఎస్కే మాలుంబీ, ఎస్కే.యాకూబ్‌పాషా పాల్గొన్నారు.