తాండూరు రూరల్ (పెద్దేముల్): పెద్దేముల్‌లో అధికారులు చేపట్టిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ తీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. గత ఉపాధి హామీ తనిఖీలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీఎస్పీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తుండగా.. మండలంలో 1-8-2013 నుంచి 31-5-2014 వరకు చేసిన ఉపాధి పనులపై తాజాగా సోషల్ ఆడిట్ జరిగింది. ఇందుకు 25 గ్రామ పంచాయతీల్లో రూ.3 కోట్ల 97 లక్షల 69 వేల పనులు జరిగాయి.
కానీ రూ. లక్ష 50 వేలు మాత్రమే అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నెల రోజుల నుంచి మండలంలో 36 మంది వీఎస్‌ఓ (విలేజ్ సోషల్ అడిటర్స్)లు సోషల్ అడిట్ నిర్వహించారు. సోమవారం పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ 7వ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రమేష్ గుప్తా, డ్వామా ఎగ్జిక్యూటివ్ రాంచందర్, ఏపీడీ ఉమాదేవి, డీపీఎం సునీల్ సోషల్ అడిట్ నిర్వహించారు. సోషల్ ఆడిట్ అనంతరం డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి పలు అంశాలను వెల్లడించారు.
► రేగొండి కూలీలకు రూ.92,825 చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వనందున మండల కమిటీ కో ఆర్డినేటర్ శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు.
►తట్టేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ్‌కుమార్.. బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.21,548 అవకతవకలకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు.
►అత్కూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ పేర్లతో రూ.1980 కాజేయడంతో సొమ్ము రికవరీకి ఆదేశం.
►బుద్దారం కూలీలకు చెల్లించాల్సిన రూ.60 వేలను గ్రామ సీఎస్పీ ఇవ్వనందు న తొలగింపునకు ఆదేశాలు.
►నాగులపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రాములు బినామీ కూలీల పేర్లు సృష్టించి డబ్బులు కాజేయడంతో తొలగింపు.
►గోపాల్‌పూర్ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ రూ.56 వేల అవకతవకలకు పాల్పడటంతో తొలగింపు.
►పాషాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.5,158 కాజేయడంతో రికవరీకి ఆదేశం.
►కోట్‌పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య రూ.18,850, అడికిచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ స్వామిదాస్ రూ.14,208 కాజేయడంతో విధుల్లోంచి తొలగింపు.
పలువురు సీఎస్పీలు.. వీబీకేల తొలగింపు..
గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలకు పాల్పడిన సీఎస్పీలు, వీబీకేలను తొలగించినట్లు ఏపీడీ ఉమాదేవి పేర్కొన్నారు. కోట్‌పల్లి, పాషాపూర్, ఇందూర్, నాగులపల్లి, కందనెల్లి, బుద్దారం, మారెపల్లి, గాజీపూర్ సీఎప్పీలను తొలగిం చామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలు జరగడంతో రుక్మాపూర్, పాషాపూర్, నాగులపల్లి, ఓమ్లనాయక్ తండా వీబీకేలను తొలగించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వాణిశ్రీ, వైస్ ఎంపీపీ నర్సమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఎంపీడీఓ సంధ్య, ఏపీడీ శోభారాణి, ఏపీఓ శారద పాల్గొన్నారు.
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు!
Published Tue, Sep 2 2014 2:09 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM
Advertisement
Advertisement