Technical assistants
-
సాంకేతిక సహాయకుల అధికారాల కోత
సాక్షి, హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో కీలకంగా వ్యవహరిస్తున్న సాంకేతిక సహాయకుల (టెక్నికల్ అసిస్టెంట్లు) అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. ఇంజనీరింగ్ పనులను దాదాపుగా తొలగించి కేవలం కూలీలతో సంబంధం ఉన్న పనులకే పరిమితం చేసింది. చెరువుల్లో పూడికతీత, కొత్త ఫీడర్ చానళ్ల నిర్మాణం, కొత్త ఫీల్డ్ చానళ్ల ఏర్పాటు, కాల్వల్లో మట్టి తొలగింపు, చెక్ డ్యామ్‌లలో పూడికతీత, గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణ పనుల నుంచి వీరిని తప్పించింది. ఈ పనులను నేరుగా ఇంజనీరింగ్ అధికారి (ఎన్ఈవో)కి అప్పగించింది. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో పనిచేసే మండల ఇంజనీరింగ్ అధికారి పోస్టును ఇటీవల ఎన్‌ఈవోగా నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వీరే పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం, కూలీలు చేసే పని మదింపు, ఎంబీ రికార్డు టెక్నికల్ అసిస్టెంట్లు చూస్తున్నారు. ఆపై మండల స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) చెక్కు జారీ చేస్తున్నారు. వీరిరువురిపై ఏపీవో అజమాయిషీ చేసేవారు. అయితే, తాజాగా టెక్నికల్ అసిస్టెంట్ సహా ఈసీ, ఏపీవో పనులకు కూడా కోత పడింది. ఇంజనీరింగ్ పనుల గుర్తింపు, అంచనా ప్రతిపాదనలు, ఈ–మస్టర్ తయారీ, ఎంబీ రికార్డు మొదలు చెక్కు జారీ చేసే విధులను ఎన్ఈవో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా కోట్ల విలువైన పనుల నుంచి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న టీఏ, ఈసీ, ఏపీవోలను వ్యూహాత్మకంగా తప్పించింది. ఆ మేరకు ఎన్‌ఈవోలకు ప్రత్యేక లాగిన్ ఐడీని కూడా జారీ చేసింది. క్షేత్ర సహాయకుల దారిలో.. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి సమ్మెబాట పట్టిన 7,500 మంది క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్లు)పై ప్రభుత్వం వేటు వేసింది. పనితీరును గ్రేడింగ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎఫ్‌ఏలు మార్చి మాసంలో ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనకు ఏ మాత్రం వెరవని ప్రభుత్వం.. అదే నెల చివరి వారంలో ఎఫ్‌ఏలకు ఉద్వాసన పలికింది. మేం మళ్లీ విధుల్లో చేరుతాం మొర్రో అని మండల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా పట్టించుకోకుండా..వీరి విధులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. తాజాగా తమ విధుల్లోనూ కోత పెడుతుండడంతో టెక్నికల్ అసిస్టెంట్లలోనూ ఆందోళన నెలకొంది. గడువులోగా చేయాల్సిందే ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికలు, కల్లాలను నాలుగు నెలల్లో నిరి్మంచాలని స్పష్టం చేసింది. వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ రోడ్లు, కాల్వలను, అంతర్గత రోడ్లను ప్రతి రోజూ క్లీన్ చేయాలని స్పష్టం చేశారు. హరితహారం కింద ప్రతిపాదించిన ప్రకృతి వనాలను సాధ్యమైనంత త్వరగా నిరి్మంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాక్టర్లను సమీకరించుకోని పంచాయతీలు.. ఈ నెలాఖరులోపు కొనుగోలు చేయాలన్నారు. కాగా, గ్రామీణ ఉపాధి హామీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించిన సర్కారు.. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన ఇంజనీరింగ్ పనులను ఆయా శాఖలు గుర్తించాలని సూచించింది. తద్వారా అభివృద్ధి పనులకు నరేగా నిధులను విరివిగా వాడుకోవాలని యోచిస్తోంది. -
తిర‘కాసు’..!
సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఎస్ఈ తెలంగాణ ప్రాంతానికి బదిలీ అయ్యేందుకు సిద్ధపడ్డారు.. జిల్లాలో ఉన్నంత కాలం విధులు నిర్వర్తించాం.. తుది అవకాశం సద్వినియోగం చేసుకుందామనే దిశగా పావులు చురుగ్గా కదిపారు.ముంపు బాధితుల కోటాలో అనర్హులకు అగ్రపీఠం వేశారు. ఉద్యోగాలో... మొర్రో అంటూ ఓవైపు అర్హులు వాపోతుంటే, మరోవైపు అనర్హులకు అందలమెక్కిస్తూ చేతివాటం ప్రదర్శించారు. ఇదివరకే లబ్ధిపొందిన కుటుంబాలకు చెందిన మరో ఇరువురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగుగంగ ముంపు బాధితులు ఇంకా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల కాలంలో సుమారు 200 మందికి వివిధ ఉద్యోగాలు దక్కాయి. మరో ఐదువేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దళారుల చేతివాటం కారణంగా అనర్హులకు అవకాశం దక్కుతోంది. తెలుగుగంగ ఎస్ఈ కార్యాలయం ఇందుకు వేదికైంది. టెక్నికల్ అసిస్టెంట్లుగా ఆరుగురిని నియమించేందుకు ఎస్ఈ యశశ్వని జిల్లా కమిటీ ద్వారా ఇటీవల ఉత్తర్వులు సిద్ధం చేశారు. ఆ ఆరుగురిలో ముగ్గురు అనర్హులంటూ ఆధారాలతోసహా ముంపు వాసులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వారికి పోస్టింగ్ నిలిపినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా వారిలో ఇరువురికి పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందివచ్చిన తుది అవకాశం.... తెలుగుగంగ ఎస్ఈ యశశ్వని తెలంగాణ ప్రాంతవాసి. ఆ రాష్ట్రానికి ఇటీవల బదిలీ ఉత్తర్వులొచ్చాయి. ఆమేరకు గురువారం రిలీవ్ అయ్యారు. ఇరువురికి ఉద్యోగాలు అప్పగించేందుకు, మరో ఇరవై మందిని అర్హుల జాబితాలో చేర్చేందుకు ఆ కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. జీఓ నెంబర్ 98 ప్రకారం మునకలో అవార్డు పొందిన వారికి ఉద్యోగం కల్పించాల్సి ఉంది. అయితే ఒకే అవార్డుపైన ఇరువురికి అవకాశం కల్పిస్తున్నారు. ఇదివరకే కుటుంబంలో అవార్డు పొందిన పి.శ్రీనివాసులరెడ్డి, బి.శ్రీనివాసులరెడ్డిలకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు అన్ని రకాల లాంఛనాలు పూర్తి అయినట్లు సమాచారం. చాపాడు మండలం చీపాడులో ఒకరు, మైదుకూరు మండలం గుడ్డివీరయ్యసత్రంలో స్థిరపడిన మరొకరికి ప్రస్తుతం అవకాశం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఇది వరకే ఉద్యోగాలు దక్కాయి. అదే జరిగితే రెండ వ వ్యక్తికి ఒకే అవార్డు కింద ఉద్యోగాలు ఇవ్వరాదన్న నిబంధనలు ఉల్లంఘించినట్లే. అంతేకాకుండా మరో ఇరవై మంది అనర్హులను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఎస్ఈ బదిలీకి రెండు రోజుల ముందు ఈ ప్రక్రియ వేగవంతం చేశారనే గుసగుసలు వినిపిస్తున్నారు. ఎస్ఈ యశశ్వని ఏమన్నారంటే.... ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. అయితే ఆ ఇరువురిపై ఫిర్యాదులందాయి. ఆమేరకు ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశాం. తదుపరి వచ్చే అధికారి ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. నేను ఎవరికీ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వలేదు -
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు!
తాండూరు రూరల్ (పెద్దేముల్): పెద్దేముల్లో అధికారులు చేపట్టిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ తీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. గత ఉపాధి హామీ తనిఖీలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీఎస్పీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తుండగా.. మండలంలో 1-8-2013 నుంచి 31-5-2014 వరకు చేసిన ఉపాధి పనులపై తాజాగా సోషల్ ఆడిట్ జరిగింది. ఇందుకు 25 గ్రామ పంచాయతీల్లో రూ.3 కోట్ల 97 లక్షల 69 వేల పనులు జరిగాయి. కానీ రూ. లక్ష 50 వేలు మాత్రమే అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నెల రోజుల నుంచి మండలంలో 36 మంది వీఎస్ఓ (విలేజ్ సోషల్ అడిటర్స్)లు సోషల్ అడిట్ నిర్వహించారు. సోమవారం పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ 7వ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రమేష్ గుప్తా, డ్వామా ఎగ్జిక్యూటివ్ రాంచందర్, ఏపీడీ ఉమాదేవి, డీపీఎం సునీల్ సోషల్ అడిట్ నిర్వహించారు. సోషల్ ఆడిట్ అనంతరం డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ► రేగొండి కూలీలకు రూ.92,825 చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వనందున మండల కమిటీ కో ఆర్డినేటర్ శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు. ►తట్టేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ్‌కుమార్.. బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.21,548 అవకతవకలకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ►అత్కూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ పేర్లతో రూ.1980 కాజేయడంతో సొమ్ము రికవరీకి ఆదేశం. ►బుద్దారం కూలీలకు చెల్లించాల్సిన రూ.60 వేలను గ్రామ సీఎస్పీ ఇవ్వనందు న తొలగింపునకు ఆదేశాలు. ►నాగులపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రాములు బినామీ కూలీల పేర్లు సృష్టించి డబ్బులు కాజేయడంతో తొలగింపు. ►గోపాల్పూర్ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ రూ.56 వేల అవకతవకలకు పాల్పడటంతో తొలగింపు. ►పాషాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.5,158 కాజేయడంతో రికవరీకి ఆదేశం. ►కోట్‌పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య రూ.18,850, అడికిచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ స్వామిదాస్ రూ.14,208 కాజేయడంతో విధుల్లోంచి తొలగింపు. పలువురు సీఎస్పీలు.. వీబీకేల తొలగింపు.. గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలకు పాల్పడిన సీఎస్పీలు, వీబీకేలను తొలగించినట్లు ఏపీడీ ఉమాదేవి పేర్కొన్నారు. కోట్‌పల్లి, పాషాపూర్, ఇందూర్, నాగులపల్లి, కందనెల్లి, బుద్దారం, మారెపల్లి, గాజీపూర్ సీఎప్పీలను తొలగిం చామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలు జరగడంతో రుక్మాపూర్, పాషాపూర్, నాగులపల్లి, ఓమ్లనాయక్ తండా వీబీకేలను తొలగించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వాణిశ్రీ, వైస్ ఎంపీపీ నర్సమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఎంపీడీఓ సంధ్య, ఏపీడీ శోభారాణి, ఏపీఓ శారద పాల్గొన్నారు. -
తవ్వేకొద్దీ అవినీతి!
కర్నూలు(కలెక్టరేట్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన ఈ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి వెలుగు చూస్తోంది. ఎవరి స్థాయిలో వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9,798 మంది ఈ కోవలో ఉన్నారంటే అవినీతి ఏ స్థాయిలో చోటుచేసుకుందో అర్థమవుతోంది. జిల్లాలో 2007 సంవత్సరం నుంచి పథకం అమలవుతుండగా.. ఇప్పటి వరకు రూ.1,650 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.235 కోట్లు వ్యయమైంది. ఇంత చేసినా ఎక్కడా ఆ పనుల జాడ లేకపోవడం గమనార్హం. జిల్లాలో వెలుగుచూసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడా లేని విధంగా సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రూ.124.9 కోట్ల దుర్వినియోగం వెలుగుచూసింది. పథకంలోని అక్రమాలపై యేటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏడో విడత తనిఖీ కొనసాగుతుండగా.. రూ.756.9 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం 7.50 లక్షల జాబ్ కార్డుల్లో అత్యధికం బోగస్‌వేనని తెలుస్తోంది. చనిపోయిన.. విద్యార్థులు.. ఉద్యోగుల పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి కొందరు సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. అక్రమాలపై విచారణ చేపట్టి శిక్షించేందుకు మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మూడేళ్లుగా ప్రచారంలో ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. మొబైల్ కోర్టుల ప్రచారం నేపథ్యంలో అక్రమార్కులను మూడు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొబైల్ కోర్టుల్లో సత్వరం విచారణ జరిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కోర్టును ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు మరింత చెలరేగుతున్నారు. సామాజిక తనిఖీల్లో రూ.795 కోట్లు దుర్వినియోగమైనట్లు తేలినా.. అధికారులు కేవలం గ్యాప్‌లు మాత్రమేనంటూ అవినీతి మొత్తాన్ని రూ.8,68,06,259కు కుదించడం గమనార్హం. ఈ మొత్తంలోనూ రూ.1.79 కోట్లు మాత్రమే రికవరీ చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. అవినీతిలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అగ్రస్థానం అక్రమించారు. అధికారికంగానే టెక్నికల్ అసిస్టెంట్లు రూ.2.18కోట్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.1.41 కోట్లు స్వాహా చేసినట్లు స్పష్టమైంది. వెల్దుర్తి, కృష్ణగిరి, ఎమ్మిగనూరు, పాములపాడు, పత్తికొండ, ప్యాపిలి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు, మద్దికెర తదితర మండలాల్లో నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు కళ్లెం వేయలేని పరిజ్ఞానం: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించినా ఫలితం లేకపోయింది. జాబ్ కార్డు వెరిఫికేషన్ చేపట్టినా తూతూమంత్రంగా సాగింది. జిల్లాలో 2.15 లక్షల బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లు మాత్రమే తేల్చగలిగారు. ఈఎంఎంఎస్, ఈ-మెజర్మెంట్ విధానాలను అమల్లోకి తీసుకొచ్చినా.. ఆన్లైన్ పేమెంట్ చేపడుతున్నా అక్రమాలను అడ్డుకోలేకపోవడం గమనార్హం. అక్రమాలను తగ్గిస్తున్నాం - హరినాథ్‌రెడ్డి, డ్వామా పీడీ ఎన్ఆర్ఈజీఎస్లో అక్రమాలను తగ్గిస్తున్నాం. పీడీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజోపకర పనులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. డంపింగ్ యార్డులు, పండ్ల తోటల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించం. ఇప్పటికే బాధ్యులపై చర్యలు మొదలుపెట్టాం. దుర్వినియోగం చేసిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నాం. -
రిక‘వర్రీ’
ఉపాధిహామీ పనుల్లో కూలీల పొట్టగొట్టి అందినంద దండుకున్న అక్రమార్కులపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిధుల దుర్వినియోగం జరిగినట్టు సామాజిక తనిఖీలలో బట్టబయలయినా రికవరీ చేయడంలో వెనుకాడుతున్నారు. సర్కారు సొమ్మే కదా.. మనదేం పోయిందన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల అక్రమాలకు పాల్పడితే చర్యలుంటాయనే భయం లేకపోవడంతో మరింత మంది భోక్తలు పుట్టుకొస్తున్నారు. సాక్షి, కరీంనగర్ : ఉపాధిహామీ పనులలో నిధుల దుర్వినియోగాన్ని నిగ్గుతేల్చేందుకు ఐదు విడతలుగా సామాజిక తనిఖీ జరిగింది. ఆరో విడత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీలలో జిల్లాలో రూ.7.13 కోట్ల నిధులపై అభ్యంతరాలు రాగా.. ఇందులో రూ.5.39 కోట్లు దుర్వినియోగమైనట్టు తేలింది. దోషులు ఎవరన్నది నిర్ధారణ అయ్యింది. ఎవరెవరు ఎంతెంత మెక్కారన్న లెక్కలు కూడా తేలాయి. వారినుంచి డబ్బులను తిరిగి రాబట్టేందుకు చేపట్టిన చర్యలు మాత్రం ఫలితాలివ్వడం లేదు. ఐదు విడతల సామాజిక తనిఖీలలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో 12,857 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 6,019 అభ్యంతరాలపై విచారణ పూర్తయింది. మిగిలిన 7,838 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 4,348 మంది అధికారులు, సిబ్బంది, ఇతరులను ఈ అక్రమాలకు భాద్యులుగా గుర్తించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిలో మండల అభివృద్ధి అధికారులు, సహాయ ఇంజినీర్లు సైతం ఉండడం విశేషం. అక్రమార్కుల్లో 24 మంది మండల అభివృద్ధి అధికారులు, 66 మంది ఏపీవోలు, 60 మంది ఏఈలు, 2,196 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 25 మంది సర్పంచులు, 216 మంది బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, 572 మంది మేట్లు, 538 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరు దుర్వినియోగం చేసిన డబ్బులను రికవరీ చేయడంతోపాటు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియ సజావుగా జరగడంలేదు. 4వేల మంది దుర్వినియోగానికి పాల్పడితే నలుగురు ఎంపీడీవోలతో సహా 38 మందిని సస్పెండ్ చేయడం, 640 మంది తాత్కాలిక సిబ్బందిని విధుల నుంచి తొలగించడం లాంటి చర్యలకు పరిమితమయ్యారు. చర్యలు నామమాత్రంగా ఉండడం వల్లనే అక్రమాలకు కళ్లెం పడడం లేదన్న విమర్శలున్నాయి. ఆరు విడతల్లో అవినీతి వెల్లడయినా ఇంతవరకు అధికార యంత్రాంగం రూ.2.12 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. రికవరీ విషయంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతుండడం వల్ల ఈ పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలినా వారి నుంచి రికవరీ సాధ్యం కావడంలేదన్న వాదనలున్నాయి. ఇంకా రూ.3.26 కోట్ల రికవరీ కావాల్సిఉంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి 4,358 కేసులు పెట్టారు. 48 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.2.45 కోట్లు రాబట్టేందుకు 922 కేసులు పెట్టాలని నిర్ణయించారు. రికవరీని వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనే దుర్వినియోగం జరగకుండా నిఘా వ్యవస్థ ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దుస్థితి ఉండదని అంటున్నారు.