ఉపాధిహామీ పనుల్లో కూలీల పొట్టగొట్టి అందినంద దండుకున్న అక్రమార్కులపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిధుల దుర్వినియోగం జరిగినట్టు సామాజిక తనిఖీలలో బట్టబయలయినా రికవరీ చేయడంలో వెనుకాడుతున్నారు. సర్కారు సొమ్మే కదా.. మనదేం పోయిందన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల అక్రమాలకు పాల్పడితే చర్యలుంటాయనే భయం లేకపోవడంతో మరింత మంది భోక్తలు పుట్టుకొస్తున్నారు.
సాక్షి, కరీంనగర్ : ఉపాధిహామీ పనులలో నిధుల దుర్వినియోగాన్ని నిగ్గుతేల్చేందుకు ఐదు విడతలుగా సామాజిక తనిఖీ జరిగింది. ఆరో విడత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీలలో జిల్లాలో రూ.7.13 కోట్ల నిధులపై అభ్యంతరాలు రాగా.. ఇందులో రూ.5.39 కోట్లు దుర్వినియోగమైనట్టు తేలింది. దోషులు ఎవరన్నది నిర్ధారణ అయ్యింది. ఎవరెవరు ఎంతెంత మెక్కారన్న లెక్కలు కూడా తేలాయి. వారినుంచి డబ్బులను తిరిగి రాబట్టేందుకు చేపట్టిన చర్యలు మాత్రం ఫలితాలివ్వడం లేదు. ఐదు విడతల సామాజిక తనిఖీలలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో 12,857 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో 6,019 అభ్యంతరాలపై విచారణ పూర్తయింది. మిగిలిన 7,838 అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 4,348 మంది అధికారులు, సిబ్బంది, ఇతరులను ఈ అక్రమాలకు భాద్యులుగా గుర్తించారు.
నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిలో మండల అభివృద్ధి అధికారులు, సహాయ ఇంజినీర్లు సైతం ఉండడం విశేషం. అక్రమార్కుల్లో 24 మంది మండల అభివృద్ధి అధికారులు, 66 మంది ఏపీవోలు, 60 మంది ఏఈలు, 2,196 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 25 మంది సర్పంచులు, 216 మంది బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, 572 మంది మేట్‌లు, 538 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరు దుర్వినియోగం చేసిన డబ్బులను రికవరీ చేయడంతోపాటు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియ సజావుగా జరగడంలేదు. 4వేల మంది దుర్వినియోగానికి పాల్పడితే నలుగురు ఎంపీడీవోలతో సహా 38 మందిని సస్పెండ్ చేయడం, 640 మంది తాత్కాలిక సిబ్బందిని విధుల నుంచి తొలగించడం లాంటి చర్యలకు పరిమితమయ్యారు. చర్యలు నామమాత్రంగా ఉండడం వల్లనే అక్రమాలకు కళ్లెం పడడం లేదన్న విమర్శలున్నాయి.
ఆరు విడతల్లో అవినీతి వెల్లడయినా ఇంతవరకు అధికార యంత్రాంగం రూ.2.12 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. రికవరీ విషయంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతుండడం వల్ల ఈ పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలినా వారి నుంచి రికవరీ సాధ్యం కావడంలేదన్న వాదనలున్నాయి. ఇంకా రూ.3.26 కోట్ల రికవరీ కావాల్సిఉంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి 4,358 కేసులు పెట్టారు. 48 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.2.45 కోట్లు రాబట్టేందుకు 922 కేసులు పెట్టాలని నిర్ణయించారు. రికవరీని వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనే దుర్వినియోగం జరగకుండా నిఘా వ్యవస్థ ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దుస్థితి ఉండదని అంటున్నారు.
రిక‘వర్రీ’
Published Mon, Dec 30 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement