►అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామభద్రపురం
►క్కడికెళ్లిన అధికారులకు అంటుకుంటున్న అవినీతి మరక
►మూడేళ్లుగా వెలుగు చూస్తున్న అక్రమాలు
►ఏటా ఎవరో ఒకరి సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రామభద్రపురం మండలం అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అక్కడకు ఏ అధికారి వెళ్లినా ఆ మరక అంటించుకుంటున్నారు. ఇటీవలి జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 2015లో పీఐడీపీ పనుల్లో అక్రమాలతో కొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. 2016లో నీరు చెట్టు అక్రమాలతో పలువురు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పుడేమో వ్యవసాయ అధికారి సస్పెండ్ అయ్యారు.
పీఐడీపీ అక్రమాల్లో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
2015లో రామభద్రపురం మండలంలో చేపట్టిన పీఐడీపీ(పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్) పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. ఏడాది కాలంలో రూ.5కోట్ల విలువైన 150చెరువు పనులు చేపట్టారు. దానికి సంబంధించిన మట్టి పనుల్ని కూలీల చేత చేయించాలి. కానీ ఇక్కడ కొన్ని చెరువుల మట్టి పనుల్ని యంత్రాలతో చేయించి, కూలీల చేత చేయించినట్టు బిల్లులు డ్రా చేసేశారు. రోజురోజుకు ఎక్కువైన అక్రమాల నేపథ్యంతో పాటు అధికారుల మధ్య మనస్పర్ధలు రావడంతో అన్నీ బట్టబయలయ్యాయి. సాక్షాత్తు అక్కడి ఏపీఓ సత్యవతి నేరుగా ఫిర్యాదు చేయడం విశేషం. రూ.5లక్షల అంచనా వ్యయంతో బూసాయివలస కేజీబీవీ పాఠశాల మైదానం చదును పనులు చేపట్టగాఇందులో కూలీలతో చేయించాల్సిన మట్టి తవ్వకాలను యంత్రాలతో చేసి సుమారు రూ.2లక్షలు అడ్డగోలుగా డ్రా చేశారని ఆరోపించారు.
ముచ్చర్లవలసలో శ్మశానం చదునుకు రూ.4.15లక్షల అంచనాతో పనులు చేపట్టగా ఇందులో కూలీలతో చేయాల్సిన మట్టి తవ్వకాలను యంత్రాలతో చేయించి రూ.1.75లక్షలను డ్రా చేశారని, రామభద్రపురం ఎంపీడీఓ కార్యాలయ సముదాయం చదునుకు రూ.3.34లక్షలు కేటాయించగా అందులో కూలీలతో చేయాల్సిన మట్టి పనుల్ని యంత్రాలతో చేయించి రూ.80వేలు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. దీంతో డ్వామా అధికారులు శాఖాపరమైన విచారణ జరిపించారు. పలు లోపాల్ని గుర్తించారు. సోషల్ ఆడిట్ కూడా నిర్వహించారు. అక్రమాలు బయటపడ్డాయి. ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్‌కు గురయ్యారు.
2016లో నీరు చెట్టు అక్రమాలు
నీరుచెట్టు నిధుల దుర్వినియోగంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2016లో ఇదొక టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అయ్యింది. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కైపోయి ఇష్టారీతిన పనులు చేపట్టారు. రూ. 3కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. నచ్చినంతకు బిల్లు తయారు చేసి పాస్ ఆర్డర్ జారీ చేసుకున్నారు. మరికొన్నిచోట్ల కొలతల పుస్తకాలు(ఎంబుక్) తారుమారు చేసి నిధులు డ్రా చేశారు. దీనిపై శాఖా పరమైన విచారణ చేపట్టారు.
ఒకవైపు ఇరిగేషన్, డ్వామా అధికారులు విచారణ చేపట్టగా, మరోవైపు సోషల్ ఆడిట్ నిర్వహించారు. దాదాపు అన్ని విచారణల్లోనూ అక్రమాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఎంపీడీఓ, ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ఏపీఓ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు 16మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. వారితో పాటు 22మంది సర్పంచ్‌ల చెక్ పవర్ కూడా రద్దు చేశారు. దీన్ని బట్టి ఇక్కడెంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా వ్యవసాయ అధికారి...
పెసర, మినుము విత్తనాలతో పాటు ఎరువుల విక్రయ సొమ్మును రామభద్రపురం వ్యవసాయ అధికారి చింతాడ ప్రసాదరావు పక్కదారి పట్టించారు. మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్‌కు చెల్లించాల్సిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. సుమారు రూ. 8లక్షల వరకు కట్టకపోవడంతో ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు. ఇప్పుడిది మండలంలో కలకలమయ్యింది. మొత్తానికి వరుస సస్పెన్షన్‌లతో రామభద్రపురం మండలం జిల్లాలోనే చర్చనీయాంశమవుతోంది.
అక్కడ అవినీతి ‘భద్రం’
Published Wed, Mar 8 2017 2:54 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement