
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. అనంతరం అరగంటకుపైగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్ వేదికపై మౌనంగా కూర్చోగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక దశలో పవన్‌ను మాట్లాడాలంటూ నాదెండ్ల సైగ చేస్తూ మైక్ జరిపినా స్పందించేందుకు నిరాకరించారు.
3 రోజులు జనసేన సోషల్ ఆడిట్..
నవంబరు 12, 13, 14వతేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో జనసేన తరఫున సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణంపై నివేదిక ఇస్తారని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 26 జిల్లా కేంద్రాల్లోనూ ‘జనవాణి’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.