సాక్షి, అమరావతి/సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసలు ముఖ్యమంత్రి పదవి రేసులోనే లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంటూ సంకేతాలిస్తూ, పొత్తుల్లో జనసేన పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలని అడగడానికి ఓ స్థాయి ఉంటుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ గురువారం మీడియాతో మాట్లాడారు.
టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. మాట్లాడతాం. (బీజేపీని ఉద్దేశించి) కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పిస్తాం. వాస్తవాలు, గణాంకాలు చూపి ఒప్పిస్తాం’.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు–పవన్ భేటీ తర్వాత కొంతమంది జనసేన నేతలు మీరు తగ్గడం ఏమిటని, మీరు ముఖ్యమంత్రిగా అయితే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని, మీరు సీఎం అభ్యర్థిగా ఉండాలి కదా అని మాట్లాడడాన్ని పవన్ తప్పుబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
30–40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి అడిగే వాళ్లమేమో..
ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని అనేవాళ్లు ఎవరైనా సరే, అలాంటి ఆలోచనతో ఉంటే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. జనసేన గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసింది. ఎన్ని గెలిచాం? పొత్తుల్లో ఇతర పార్టీలను సీఎం స్థానం కోసం డిమాండ్ చేయాలంటే కనీసం 30–40 స్థానాలు ఉండాలి. అప్పుడే ఆ వాదనకు బలం ఉండేది. ఇక తాను ఇప్పటివరకూ ఎవరికైనా పెద్దన్న పాత్ర వహించాలని చెప్పానంటే అది బాధ్యత వహించడం అని అర్ధం. అంతేగానీ, ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమది.
సీఎం పదవి కావాలని కండిషన్లు పెడితే జరగవు..
ఒక మాట చెబుతున్నా.. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అలాంటప్పుడు మన వాదన (సీఎం పదవి కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్‌స్టార్ చేయలేదు. నేను సాధించుకున్నదే. రాజకీయాల్లో కూడా టీడీపీ కావొచ్చు. బీజేపీ కావొచ్చు.. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు. నేను టీడీపీ అధ్యక్షుడిని అయినా ఆ మాటలు అనను. మనం బలం చూపించి, సత్తా చూపించి పదవి తీసుకోవాలి.
కండిషన్లు పెడితే, అవి జరగవు. సీఎం పదవి అన్నది తానై వరించాలి తప్ప నేను దాని కోసం వెంపర్లాడను. పొత్తులకు జనసేన పార్టీ పెట్టే కండిషను వైఎస్సార్‌సీపీని అధికారం నుంచి దించాలి అంతే. అలాగే, పొత్తులతో ప్రభుత్వం ఏర్పడాలి. నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలపై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకోవాలి. ఓటు చీలనివ్వను అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయో ఆ పార్టీలు కలవాలన్నది నా ఉద్దేశం. ప్రధాన పార్టీలకు సంబంధించే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇక ఎన్నికలు ముందే వస్తాయని అనిపిస్తోంది. అందుకని జూన్ నుంచి రాష్ట్రంలోనే ఉండి పర్యటిస్తా.
నాతో నడిచే వాళ్లే నా వాళ్లు..
ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమోనని ఒక విలేకరి (సాక్షి కాదు) అన్నప్పుడు.. ‘విమర్శలు వస్తాయని నాకు భయాలు లేవు. అభిమానులు నిరాశ పడడానికి ఇదేమి సినిమా కాదు. కార్యకర్తలైనా సరే.. నాతో నడిచేవారే నా వాళ్లు. అర్ధంచేసుకునే వాళ్లు అర్ధంచేసుకుంటారు’.. అంటూ పవన్
వ్యాఖ్యానించారు.
ఆఖరి గింజ కొనేవరకు పోరాటం
మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలోనూ పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి ధాన్యం గింజ కొనేంత వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయన్నారు.
అలాగే, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడంలేదన్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్తే రైతుల్ని అరెస్టుచేస్తున్నారని, ఇలా అయితే తీవ్ర పరిణామాలుంటాయని పవన్ హెచ్చరించారు. అంతకుముందు.. పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment