‘ఉపాధి’ స్కాం...ఢాం..! | Coolies employment of doing Tasks | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ స్కాం...ఢాం..!

Published Tue, Mar 25 2014 3:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు - Sakshi

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

 మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పల్లెల్లో వలసలు నివారించి,గ్రామాల్లో ఉన్న చోటనే పేద ప్రజలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని అవినీతి తిమింగలాలు అమాంతం మింగేస్తున్నాయి. జిల్లాలో 2007 నుండి ఇప్పటి వరకు అయిదు విడతల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)లలో  20.40 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. జిల్లా ఉపాధి విజిలెన్స్ అధికారులు  మాత్రం  ఇప్పటి వరకు వాటిపై  విచారించి అందులో రూ.10.16 కోట్లు కచ్చితంగా కట్టాల్సిందేనని తేల్చేశారు.

 

దాంట్లో అవినీతికి పాల్పడిన సిబ్బంది నుండి  అధికారులు  ఇప్పటి వరకు వసూళ్లు చేసింది మాత్రం  రూ. 3.48 కోట్లు మాత్రమే. మిగతా 6.68 కోట్ల రికవరీ  పెండింగ్‌లోనే ఉంది. మరో 10.23 కోట్ల అవినీతి గుట్టు విప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఇది మాత్రమే కాకుండా రూ.2కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్లు వచ్చిన ఆరోపణలపై  డ్వామా అధికారులు విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చేశారు.


 వామ్మో..ఇంత మింగుడా


 జిల్లాలో రోజురోజుకు ఉపాధి పనుల్లో అవినీతి చిట్టా పెరిగి పోతుండడంతో జిల్లా అధికారులు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 10.16 కోట్లను రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారులు తేల్చగా గత అయిదేళ్లుగా కేవలం రూ.3.48 కోట్లనే చేయగలిగారు. అక్రమాలు గుర్తించినా ఇతర ఉపాధి సిబ్బందికి పలుమార్లు అధికారులు  నోటీసులు జారీ చేసినా వాటిని  పట్టించుకోలేదు. ఇక రూ. 6.68 కోట్లను రికవరీ చేయడం డ్వామా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కొందరు వీటిపై కోర్టులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరూ తమ రాజకీయ ప్రాబల్యంతో గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నారు.రూ. 10.23 కోట్ల అవినీతిపై విచారించాల్సి ఉంది. అది జరిగే లోపే మరిన్ని సోషల్ ఆడిట్‌ల ద్వారా వచ్చి చేరుతున్నాయి. ఇలా ఈ చిట్టా పెరిగిపోతుండడం అందర్నీ బెంబేలెత్తిస్తోంది.


 ఒక మండలంలోనే రూ.2.50 కోట్ల పనుల్లో అవకతవకలు


 లింగాల మండలంలో గతేడాది 13 గ్రామాలలో   జరిగిన పనులపై గత నెల 12వ తేదీన  జరిగిన అయిదో విడత సామాజిక తనిఖీలో రూ.4.37 కోట్ల పనులకు ఆడిట్ చేయగా ఏకంగా రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది.సామాజిక తనఖీల రాష్ట్ర డెరైక్టర్ సౌమ్య నేతృత్వంలో జరిగిన ప్రజావేదికలో ఈ అక్రమాల చిట్టా బయట పడ్డాయి. వీరిలో వలసలు వెళ్లినవారు, పెళ్లిళ్లు జరిగి ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారు, ఆఖరికి చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి. వారి పేర్లను  మస్టరుల్లో రాసి బినామి బిల్లులతో స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది.


 పలువురిపై వేటు వేసినా...


 వివిధ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అవినీతి ఆధారంగా పలువురిపై రికార్డు స్థాయిలో వేటు వేసినా అవినీతి పరులు చలించడం లేదు. ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉపాధికి సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నారు.
 ఉపాధి పనుల్లో ఏకంగా రూ. 2.50 కోట్ల  అవినీతి జరిగినట్లు గుర్తించిన జిల్లా అధికారులు లింగాల మండల స్థాయి సిబ్బందిపై క ఠిన చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.సామాజిక తనిఖీలో జరిగిన అక్రమాలు వెలువడిన వెంటనే ఆ మండల ఏపిఓ లక్ష్మినారాయణతోపాటు నలుగురు టి.ఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్‌లు, ఎనిమిది మంది క్షేత్ర సహాయకులను విధుల నుంచి ఇటీవల తాత్కలికంగా తొలగించారు.వారిపై ఉన్న అభియోగాలపై  విచరణ చేపట్టే పనిలో అధికారులు ఉన్నారు.అంతేకాకుండా అదే మండలానికి చెందిన 150 మంది మేట్లను శాశ్వతంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.

 

ఇలా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఉపాధి సిబ్బంది  రూ. 20 కోట్లకు పైగా  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధులకు కొందరు తాత్కాలికంగా  దూరమవ్వగా, మరికొంత మంది సిబ్బందిని శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. ఇందులో ఎక్కువగా గ్రామాల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు  1086మంది ఉన్నారు. వీరే దాదాపు 10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్టు సామాజిక తనిఖి నివేదికల ద్వారా అధికారులు గుర్తించారు.

 

వారి తరువాతి స్థానంలో సాంకేతిక సహాయకుల(టి.ఏ) రెండో స్థానంలో నిలిచారు.జిల్లాలోని 725 మంది టి.ఏలపై రూ. 5.41 కోట్ల  మేర అవినీతికి పాల్పపడ్డట్టు అధికారులు గుర్తించారు.ఇలా ఆయా మండలాల్లో 1999 మంది  మేట్లు 1.10కోట్లు,31 మంది ఏఈఈలు రూ.కోటి, 57మంది ఏపిఓలు 32లక్షలు ,159మంది సి.ఓలు 14లక్షలు, సర్పంచ్‌లు రూ.23లక్షల, 71 మంది ఈసీలు అవినీతికి పాల్పపడ్డట్లు తనిఖీల్లో  అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement