మరో మూడు నెలలకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనగా... 2004 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు క్లవుస్ శ్వాబ్ ఇలా అన్నారు– ‘‘ప్రపంచం ముందు ఉన్న ప్రధాన సవాలు, పేదరిక నిర్మూలన. ఇది ఈ సమాజాన్ని నిరంతరం విభజిస్తూనే ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంత మాత్రమూ భద్రత ఉండదు.’’ ఆయన ఆ రోజు ‘విభజిస్తూనే ఉంటుంది...’ అన్నట్టుగానే, మరో పదేళ్లకు అదే హైదరాబాద్ నగరం వేదికగా రాష్ట్ర ‘విభజన’ జరిగింది. అయితే అదక్కడ ఆగలేదు, శ్వాబ్ మాటల్లోని ‘నిరంతర విభజన...’ అనే భావన రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో వాస్తవమని స్పష్టమవుతూనే వుంది.
గత రెండున్నర ఏళ్లుగా జగన్మోహన రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇప్పటికీ దిగువన మిగిలిన వర్గాలకు అమల వుతున్న పథకాలు... వారికవి– ‘నీడ్స్’ అవుతాయా లేక ‘లగ్జరీస్’ అవుతాయో ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్యం ఏమీ కాదు. అయినప్పటికీ, పైకి చెప్పలేని కారణాలతో కొందరు వీటికి అడ్డుపడుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా కొత్తగా మధ్యతరగతిగా మారినవారిలో కూడా కొందరు చిత్రంగా ఈ పథకాలను తప్పుపట్టడం చూశాము. ఎవరు వీళ్ళంతా అంటే,.. ఒకప్పుడు వీరిది దిగువ మధ్య తరగతి. అయితే వారి ప్రమేయం లేకుండా, వృద్ది లక్ష్యంగా... వేగంగా విస్తరించిన రోడ్లు, రవాణా వ్యవస్థతో వీరి భూముల విలువ కోట్ల రూపాయలు అయింది. కమ్యునికేషన్, ఐ.టీ. రంగ విస్తరణ కారణంగా వీరి పిల్లల ప్రైవేట్ రంగ ఉద్యోగాలతో వీరి జీవన ప్రమాణాలలో ఊహించని ఎదుగుదల వచ్చింది.
ఇంతవరకు బాగానే వుంది. కానీ, వీళ్ళు కూడా కొత్తగా– ‘ట్యాక్స్ పేయర్స్ మనీ...’ అంటూ సంక్షేమ పథకాల అమలుపై ‘‘సోషల్ ఆడిట్’’ చేస్తున్న సంపన్న వర్గాల భాషను మాట్లాడుతున్నారు! ఇక్కడే జర్మనీకి చెందిన ప్రొఫెసర్ శ్వాబ్ ప్రాసంగికత మనవద్ద స్పష్టం అవుతున్నది. పేదరికం సమాజాన్ని ‘నిరంతరం విభజించడం’ అదొక అంశం సరే. పేదలకు మంచిచేసే పథకాలకు అడ్డుపడ కుండా ఉండలేకపోతున్నవారు... తాము ఎంత జాగ్రత్తగా నిగ్రహించుకుని ఉంటున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట బయటపడడం వీరికి కొత్తగా వచ్చిన కష్టం అయింది! అందుకు కారణం– ఉనికి ప్రమాదం వీరి కొత్త సమస్య. గతంలో కంటే, విభజన వల్ల చిన్న ‘యూనిట్’ అయిన రాష్ట్రంలో, ఇది మునుపటికంటే మరింత బాహాటంగా స్పష్టమవుతున్నది. ఇలా– ‘భూమి’ కేంద్రంగా ఏర్పడ్డ అంతరాలను తగ్గించడానికి, జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఎలాగోలా ఆపడానికి; బయట పడుతున్నవారి రంగులు వెలిసి చివరికి వెలవెలబోతున్నాయి. (చదవండి: తొలి ‘హైబ్రిడ్ స్టేట్’ దిశగా ఏపీ అడుగులు)
శ్వాబ్ చెప్పిన మరో అంశం– ‘సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం...’ ఇండియా వంటి ‘మూడవ ప్రపంచ దేశం’లో ఆ మాట చెబుతున్నది శ్వాబ్ కావొచ్చు, కానీ దానికున్న చరిత్ర చాలా పాతది. ఒకప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ‘సోషల్ డార్వినిజం’ అన్నారు. ఇది మనకు బాగా పరిచయమైన– ‘బలవంతుడిదే రాజ్యం’ (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) సిద్ధాంతం. ఆధునిక పరిపాలనలో అది కుదరదు. ‘హారిజాంటల్’గా పంపిణీ నలువైపులకు విస్తరించాలి అంటున్న నమూనా మరొకటి వుంది. శ్వాబ్ ఇండియా వచ్చి, ఇక్కడ సంస్కరణల అమలును అందరికంటే ముందుగా తలకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్‌లో– ‘సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం...’ అంటూ ‘హారిజాంటల్’ నమూనాను మనకు ప్రతిపాదిస్తున్నాడు. అటువంటప్పుడు రెండు అంశాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావాలి. మొదటిది– ప్రతి ఒక్కరు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జీవించే– ‘సాంఘిక పెట్టుబడి’ (సోషల్ కేపిటల్) మీద సింహభాగం నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాలి. అవి– గృహనిర్మాణం, వైద్యం, విద్య, సాంఘిక భద్రత వంటివి.
రెండవది– ‘వికాసం, సమాజంలో ప్రతి ఒక్కరికి’ అన్నప్పుడు, వి.పి. సింగ్ ప్రధానిగా 1989–90 మధ్య అమలులోకి తెచ్చిన మండల్ కమిషన్ నివేదిక ప్రస్తావన ఇక్కడ తప్పదు. అప్పటినుంచి దానికి కొనసాగింపుగా జరుగుతున్న– ‘వర్నాక్యులైజేషన్ ఆఫ్ డెమోక్రసీ’ దశల వారీగా నత్త నడకన అమలు కావడం తెలిసిందే. దాన్నే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఏ.పి. ముఖ్యమంత్రి జగన్ తదుపరి దశకు చేర్చడానికి మరింత లోపలికి, సూక్ష్మ స్థాయికి తీసుకుని వెళుతున్నాడు. ఎలా? ‘బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ,’ ‘ఏ.పి. వడ్డెర డెవలప్మెంట్ కార్పో రేషన్’ వంటి కొత్త సంస్థల ఏర్పాటుకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మనం చూడవలసింది ఆ దృష్టిలో నుంచే. ఎందుకంటే, ఈ రెండింటిలో– ‘ప్రాంతం’ ఉంది, ‘ప్రజలు’ ఉన్నారు. ఒక ‘రాజ్యం’ శ్రద్ధ తీసుకోవలసిన ప్రధాన అంశాలివి. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...)
చివరిగా శ్వాబ్ చెప్పిన కీలకమైన అంశం– ‘మనకు భద్రత వుండదు...’ ఎవరీ ‘మనం’? వీరికి ఎటువంటి విషయంగా భద్రత ఉండదు? గతంలోకి ఒకసారి చూస్తే, ఆర్థిక సంస్కరణల అమలు కాలంలోనే నగరాలలోని ప్రతి పెద్ద ఆవరణ గేట్ ముందు నీలిరంగు యూనిఫారం సెక్యూరిటీ రావడం మనం గమనించలేనంత నిశ్శబ్దంగా జరిగిపోయింది.
ఇక ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగల ముఠాల కదలికలు ఎక్కువయ్యాక... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సంపన్న వర్గాల కాలనీలలో ‘ఫార్మ్ హవుస్’ల వద్ద ‘సి.సి కెమెరాలు,’ ‘ఎలక్ట్రిక్ ఫెన్సింగ్’ వంటి భద్రతా చర్యలు అవసరం అయ్యాయి. వీటికి– ‘సైబర్ క్రైం’ అదనం. ఇలా మనం మన నివాసాలలో ఉంటున్నప్పటికీ ‘భద్రత’ మన ప్రాధాన్యాలలో ఒక కొత్త అంశం అయింది. చివరిగా మనమెటు? అనేది త్వరితంగా తేల్చుకోవడం వల్ల, ఇప్పుడున్న ‘క్రాస్ రోడ్స్’ వద్ద ఒక కొత్త దశాబ్దిలో మన వైఖరికి స్పష్టత రావచ్చు. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్‌ఎస్ విశాఖపట్టణం)
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment