మహానంది: మా భర్త చనిపోయాడు.. పిల్లలకు దిక్కులేదు.. కుటుంబం గడవటం కష్టంగా ఉంది.. కరుణించి పింఛన్లు ఇవ్వండి అంటూ వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కరుణించరు. ఎన్ని వినతి పత్రాలు అందజేసినా చలించరు. ఎన్నో నిబంధనలు అడ్డేస్తారు. రేషన్ కార్డులో పేరు తప్పుందని, ఓటరు కార్డులో ఫొటో సరిగా కనిపించడం లేదని.. వేలి ముద్రలు పడటం లేదని నిలిపేసే అధికారులు మగాళ్లు వితంతు పింఛన్లు తీసుకున్నా పట్టించు కోలేదు.
మహానంది మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పింఛన్ల పంపిణీపై చేపట్టిన సామాజిక తనిఖీ అనంతరం శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ సులోచనమ్మ, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు సర్పంచులు కేశవరావు, సుబ్బయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సోషల్ ఆడిట్ నివేదికల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మహానందికి చెందిన మంగలి నారాయణ(ఐడీ నెంబరు 342432) వితంతు పింఛను తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 2007లో వితంతు పింఛను మంజూరైంది. సెప్టెంబర్ 1014 వరకు తీసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించారు. ఇదే గ్రామానికి చెందిన అనంత అనే అమ్మాయికి పట్టుమని పదిహేనేళ్లు లేవు. అయితే 342326 ఐడీ మీద వృద్ధాప్య పింఛను తీసుకుంది. ఇదే గ్రామంలో ఏడుగురు గ్రామంలో లేకున్నా సెప్టెంబర్ 2014వరకు పింఛన్లు డ్రా చేశారు.
బుక్కాపురం గ్రామానికి చెందిన ఇటుకల నాగశేషుడు(ఐడీ నెంబరు 496723) ఇతని పేరు మీద కూడా వితంతు పింఛను డిసెంబర్ 2014 వరకు వచ్చినట్లు గుర్తించారు.
గాజులపల్లె గ్రామంలో ఆరుగురు మృతి చెందినా వారి పేర్ల మీద పింఛన్లు డ్రా చేశారు. వారిలో లాలూబీ మృతి చెందినా ఆమె పేరు మీద రూ. 800, ఎస్. వెంకటేశ్వర్లు పేరు మీద రూ. 800, సాంబయ్య పేరుమీద రూ. రూ. 400, ఫర్వీన్‌బీ పేరు మీద 12 నెలలకు రూ. 2400, అమినాబీ పేరు మీద రూ. 2000, వెంకటమ్మ పేరు మీద మృతి చెందిన తర్వాత 11 నెలలకు రూ. 2200 డ్రా అయినట్లు వెలుగులోకి వచ్చాయి.
ఇదే గ్రామంలో ఇద్దరి పేర్ల మీద రెండేసి పింఛన్లు ఉన్నాయి. లబ్ధిదారులకు ఒకే పింఛను అని తెలిసినా మరో పింఛను డబ్బులు మాత్రం డ్రా చేశారు. వారిలో పరమేశ్, సి.వెంకటలక్ష్మమ్మలు ఉన్నారు. పరమేశ్ తీసుకుంటున్న పింఛనుతో పాటు తన పేరు మీద ఉన్న మరో పింఛను ద్వారా రూ. 17,500 డ్రా అయినట్లు గుర్తించారు.
గాజులపల్లె ఫీల్డుఅసిస్టెంటు వెంకటేశ్వర్లు ఐహెచ్‌ఎల్ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంలో 10 రోజుల పాటు పనిచేసినట్లు, మస్టర్‌లో రాసి రూ. 1490 తీసుకున్నాడని రికార్డుల్లో ఉంది.
గాజులపల్లెలో వేతన రశీదులు ఉన్నా, తమకు వేతనాలు చెల్లించలేదని 181 మంది కూలీలు ఫిర్యాదులు చేశారు. అయితే వెబ్‌రిపోర్ట్‌లో చూడగా రూ. 2,83,952 డ్రా చేసినట్లు గుర్తించారు. గతంలో ఉన్న బ్యాంకు వారు డ్రా చేసి ఉంటారని, వారికి వెంటనే కూలీల వేతనాలు అందిస్తామని ఏపీడీ తెలిపారు.
మగాళ్లకూ వితంతు పింఛన్లు
Published Sat, Mar 7 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement