ఆసరా పింఛన్లలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణరుుంచిం ది. సరైన పత్రాలు లేకున్నా మంజూరు చేసినవాళ్లపై, అర్హత లేకున్నా తీసుకున్నవారిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. అర్హులకే ఆసరా అందించేలా చర్యలు తీసుకుంటోంది.
బోయినపల్లి : ఆసరా పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సెర్ప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో ఆసరా ఫించన్లపై సామాజిక తనిఖీ చేసేందుకు సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ.మురళి ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు పంపించగా, వారు తనిఖీలు జరిగే మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ఆగస్టు 3 వరకు సామాజిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మన జిల్లాలో వీణవంక, శ్రీరాంపూర్, బోరుునపల్లి మండలాల్లో సామాజిక తనిఖీ చేయనున్నారు. అరుుతే గోదావరి పుష్కరాలు రావడంతో ముందుగా సూచించిన తేదీల్లో సోషల్ ఆడిట్ జరిగే పరిస్థితి కనిపించలేదు. అధికారులు పుష్కరాల విధులకు వెళ్లడం... గ్రామాల్లో కూడా పుష్కరస్నానాలకు వెళ్లే అవకాశముండడంతో సోషల్ ఆడిట్ చేపట్టలేదు.
పుష్కరాలు ముగియడంతో సోషల్ ఆడిట్‌పై మళ్లీ కదలిక మొదలైంది. రెండు మూడు రోజుల్లో పై మూడు మండలాల్లో సామాజిక తనిఖీ చేయనున్నట్లు సమాచారం. బోరుునపల్లి మండలంలో ఆగస్టు 3న సోషల్ ఆడిట్ చేయనున్నట్లు సమాచారం. ఆసరా పథకం కింద 2014 నవంబర్ 1 నుంచి 2015 మే 31 వరకు ఇచ్చిన వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ కార్మికుల పింఛన్లపై అధికారులు ఆడిట్ నిర్వహించనున్నారు.
చూసే రికార్డులివే..
ఆసరా ఫించన్ల సామాజిక తనిఖీ నిర్వహించే ఉద్యోగులు కింది రికార్డులు ఆధారం చేసుకుంటున్నారు. పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తుతో పరిశీలన రిపోర్ట్ ఎస్‌కేఎస్ ఫారం, పింఛన్ మంజూరు పత్రం, రిజెక్ట్ చేసిన జాబితా, వెయిటింగ్ లేదా పెండింగ్ లిస్ట్, కొత్త మంజూరు జాబితా, పింఛన్ డబ్బుల పంపిణీ చేసిన అక్విటెన్స్ జాబితా నెలలవారీగా, ఎన్ని పింఛన్లు, పంపిణీ చేసిన డబ్బుల వివరాలు ఈ అంశాలను తనిఖీ ఉద్యోగులకు మండల అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీడీవో కార్యాలయంలో తీసుకున్న ఈ సమాచారం ఆధారంగా తనిఖీ అధికారులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేస్తారు.
తనిఖీలు చేసేది వీరు
స్టేట్ రిసోర్స్ పర్సన్(ఎస్సార్పీ) మానిటరింగ్‌లో, ఒక సీనియర్ డీఆర్పీ ప్రతీ గ్రామపంచాయతీలో ఒక సీనియర్ వీఎస్‌ఏను ఎంపిక చేసుకుని వారికి తనిఖీ అంశాలపై శిక్షణ ఇస్తారు.
శిక్షణ పొందిన సీనియర్ వీఎస్‌ఏ డీఆర్‌పీ సూచనలతో బాధ్యతతో గ్రామాల్లో డోర్‌టూడోర్ తిరిగి విచారణ చేపడతారు. సామాజిక తనిఖీకి వెళ్లే ముందు రోజు మండలంలో పింఛన్లకు సంబంధించిన రికార్డులు వీరు పరిశీలిస్తారు. ఈ రికార్డులు ఆయా మండాలల్లో ఎంపీడీవోలు అందుబాటులో ఉంచుతారు. అనంతరం గ్రామాల్లో పంచాయతీల కార్యదర్శులతో వీఎస్‌ఏలు సమన్వయ సమావేశం నిర్వహించి కార్యాచరణలోకి దిగుతారు.
అక్రమాలు జరిగితే క్రిమినల్ కేసులు
అర్హతలు లేకున్నా పింఛన్లు మంజూరు చేసిన వారిపై, సదెరం ధ్రువీకరణ పత్రం లేకుండా పింఛన్ మంజూరుపై, చనిపోయిన వారి పింఛన్లు వాడుకున్న వారిపై, మంజూరైన వారికి డబ్బులు ఇవ్వకుండా స్వాహా చేసిన వారిపై, బీడీలు చేయని వారికి పింఛన్ మంజూరు చేసిన వారిపై, పింఛన్ డబ్బులు డ్రా చేసి పంచని వారిపై, నాన్‌లోకల్ వారికి పింఛన్లు మంజూరు తదితర ఆసరా ఫించన్లలో అక్రమాలు చేస్తే సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా మండలాల్లో అధికారులు ఆసరా పింఛన్లలో అక్రమాలు లేకుండా రికార్డులు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు.
ఆసరాపై ఆడిట్!
Published Thu, Jul 30 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement