పెన్షన్ కోసం టెన్షన్
నెలాఖరుదాకా లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ
తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
సాక్షి, హైదరాబాద్: పెన్షన్ కోసం లబ్ధిదారులు టెన్షన్ పడుతున్నారు. పింఛన్లు అందించడంలో జాప్యంతో ప్రతి నెలా ఆఖరు దాకా ఎదురుచూడాల్సి వస్తోంది. జాప్యానికి కారణాలేమిటో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొన్ని నెలలుగా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందడం లేదు. పింఛన్ పంపిణీ గడువుపై ప్రభుత్వం నుంచి ముందస్తు సమాచారం కూడా లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతి నెలా తమ పింఛన్ సొమ్ము కోసం బ్యాంకులు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 36 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వాస్తవానికి ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీని ప్రారంభించాలంటే అంతకు ముందు నెలలో కనీసం 20వ తేదీలోగానే బడ్జెట్ రిలీజ్ ఆర్డరు(బీఆర్వో)లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి.
బీఆర్వోలు విడుదల
ఫిబ్రవరి ఆసరా పింఛన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంగళవారం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)లను విడుదల చేసింది. వివిధ కేటగిరీలకు చెందిన 35,73,777మంది లబ్ధిదారుల కోసం మొత్తం రూ.394.11కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. ఆర్థికశాఖ నుంచి గ్రామీణాభి వృద్ధి శాఖకు, అక్కడ్నుంచి వివిధ బ్యాంకుల ఖాతాలకు నిధులు జమా అయ్యేసరికి 15 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నెలాఖరుకల్లా బ్యాంకు ఖాతాలు కలి గిన లబ్ధిదారులకు పింఛన్లు అందే అవకాశం ఉందని, అలా కాకుండా మాన్యువల్ ప్రక్రియ లో పింఛన్ సొమ్ము లబ్ధిదారుల చేతి కందించాలంటే ఏప్రిల్ మొదటివారం వరకు సమయం పట్టే అవకాశముందని అధికారులంటున్నారు.
మరో 44 వేల మందికి అవకాశం
సామాజిక భద్రతా పింఛన్ల పథకం ఆసరా లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో 44 వేల మందికి ఆసరా కల్పించేలా ఈ పథకానికి రూ.4,693 కోట్లను సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించింది. మొత్తం 36.18 లక్షలమంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందించే లక్ష్యంగా ఈ కేటాయింపులు చేసినట్లు తెలిసింది. అర్హులైన ప్రతి ఒక ్కరికీ ఆసరా పింఛనును సంతృప్తికరస్థాయిలో అందించాలన్న ప్రభుత్వ భావనకు అనుగుణంగానే ఆసరా పథకానికి ప్రభుత్వం తాజా బడ్జెట్లో పెద్దఎత్తున నిధులను కేటాయించిందని అధికారులు పేర్కొన్నారు.