కడప రూరల్ : అసలే జీవిత చరమాంకంలో ఉన్న పండుటాకులు.. ఆపై నిరుపేదలు...ప్రతినెల వచ్చే కొద్దిపాటి పింఛన్‌పైనే వారంతా ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో కొందరికి పింఛన్ అందుతుంటే ఇంకా వేలాది మంది అర్హులకు పింఛన్ అందడం లేదు. దీంతో అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 అక్టోబరు నుంచి వివిధ కేటగిరీల కింద పింఛన్ల కోసం మొత్తం 44,056 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాష్ర్ట ప్రభుత్వం 14,243 మందిని అర్హులుగా గుర్తించింది. ఆ జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపింది. ఈ జాబితా ప్రకారం జన్మభూమి కమిటీల నేతృత్వంలో అర్హుల ఎంపిక జరగాల్సిన తరుణంలో ప్రభుత్వం అప్పటికప్పుడు రాష్ట్రంలో కొత్తగా 1.50 లక్షల పింఛన్లను ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన ప్రకటించిన కొత్త పింఛన్లలో జిల్లాకు కేవలం 8409 కేటాయించారు. దీంతో 14,243 మంది అర్హులైనప్పటికీ వారిలో కేవలం 8409 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో 5834 మంది అర్హత పొంది కూడా పింఛన్లకు నోచుకోలేకపోతున్నారు.
బాబు రావడంతోనే ఎడాపెడా తొలగింపు
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో అన్ని కేటగిరీల కింద ప్రతినెల దాదాపు 2.35 లక్షల మంది పింఛన్లు పొందుతుండేవారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే పింఛన్లపై దృష్టి సారించారు. అనర్హత పేరుతో ఎడాపెడా పింఛన్లను తొలగించారు. ఆ ప్రకారం మొత్తం 2.35 లక్షల పింఛన్లకుగాను జన్మభూమి కమిటీ సభ్యులు నిబంధనల మేరకు అనర్హత కారణంగా 14,838 పింఛన్లను, ఆధార్‌కు సంబంధించిన ఎస్‌ఆర్‌డీహెచ్ వారు 27,816 మంది పింఛన్లను నిలుపుదల చేశారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మళ్లీ పరిశీలన చేసి చాలా మందిని అర్హులుగా గుర్తించడంతో ఆలస్యంగా పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్లు పొందుతూ రద్దయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన వాటితో కలిపితే 50 వేలకు చేరింది. వారిలో 14243 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అంటే ఇంకా దాదాపు 35 వేలమందికి పైగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరి దరఖాస్తులను పరిశీలించి వారికి పింఛన్ ఎప్పుడు మంజూరు చేస్తారనేది అర్థం కావడం లేదు. కాగా, తమకు పింఛన్ రాకపోయినా పర్వాలేదు కానీ జన్మభూమి కమిటీ సభ్యులను ప్రాధేయపడలేమని పలువురు లబ్ధిదారులు నిరాశ, నిస్పృహను వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు గిత్తల లక్ష్మన్న. వంద శాతం అంధత్వం కలిగిన వ్యక్తి. ఆయన వయస్సు 66 సంవత్సరాలు దాటాయి. ఇతను మైలవరం మండలం బెస్తవేముల గ్రామ నివాసి. ఎన్నోసార్లు పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. ఎన్నో దరఖాస్తులు చేసుకున్నాడు. అయినా ఎవరికీ కరుణ కలగలేదు. పూర్తిగా అంధత్వం ఉన్న తన దుస్థితి అధికారులకు కనపడలేదా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా తనకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నాడు.
ఈమె పేరు రుక్మిణమ్మ. పులివెందుల నివాసి. 15 ఏళ్ల క్రితం భర్త రామకృష్ణయ్య చనిపోయాడు. అప్పటి నుంచి వితంతువుల కేటగిరి కింద ఇచ్చే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. ఇంతవరకు పింఛన్ రాలేదు. ఈమె భర్త మిక్చర్ బండి పెట్టుకుని జీవనం సాగించేవాడు. భర్త చనిపోయాక జీవనం గగనమైంది. పింఛన్ వస్తే కొంత ఆసరాగా ఉంటుందని భావించింది. అయితే, ఆ భరోసా లభించలేదు. ఎన్నిమార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ కనికరించలేదు.
బాబూ కరుణించవా..!
Published Mon, Aug 17 2015 4:39 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement