సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.20గా ఉన్న కమీషన్ రూ.70కి పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల రేషన్ కార్డులకు ఐదు కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నారు. అయితే అప్పట్నుంచి డీలర్లకు కమీషన్ కింద క్వింటాల్‌కు రూ.70 ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్లవరకూ ఉన్న బకాయిలను డీలర్లకు చెల్లించనున్నట్లు చెప్పారు.
రేషన్ డీలర్ల సమస్యల అధ్యయనంపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలతో సీఎం కేసీఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ..డీలర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికీ నాలుగు సమావేశాలు నిర్వహించామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. డీలర్లు లేని రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేస్తామని, కొత్త గ్రామపంచాయతీలన్నింటికీ రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసి లీకేజీలు అరికట్టగలిగామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా అక్రమాలకు ముకుతాడు వేశామన్నారు. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కొంతమందికి రేషన్ అందడంలేదని విజ్ఞప్తులు రావడంతో వేలిముద్రలతో పాటు, కంటి ఐరిష్ ద్వారా లేదంటే మాన్యువల్‌గా బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
డీలర్ల సంఘం హర్షం
ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పనిచేసిన మంత్రి ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీలర్లు ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment