అన్న ఇంట్లో పెళ్లి.. చక్కెర తెండి! | TDp Leaders Threats to Ration Dealers in Kurnool | Sakshi
Sakshi News home page

అన్న ఇంట్లో పెళ్లి.. చక్కెర తెండి!

Published Wed, Dec 12 2018 1:39 PM | Last Updated on Wed, Dec 12 2018 1:39 PM

TDp Leaders Threats to Ration Dealers in Kurnool - Sakshi

ప్రభుత్వ చౌక దుకాణం

కర్నూలు, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఒకరు ప్రభుత్వ స్థలాలను మింగితే.. మరొకరు సంక్షేమ పథకాలకు బేరం పెట్టి వసూలు చేసుకుంటున్నారు..  ఇంకొకరు ప్రభుత్వ ఆఫీసుల్లోని పాత ఇనుప సామానులను వదలడం లేదు. తాజాగా ఓ నాయకుడు తన కూతురుకు వివాహం నిశ్చయమైంది..పెళ్లికి అవసరమైన స్వీట్లు తయారు చేసేందుకు చక్కెర ఇవ్వాలని చౌకదుకాణ దారులను బెదిరించి ఇప్పించుకున్నారు. దీనిపై  ప్రస్తుతం నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రుద్రవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి కుమార్తె వివాహం ఈ నెల 14వ తేదీ జరగనుంది. అయితే ఈ వివాహానికి అవసరమైన చక్కెరను మండలంలోని డీలర్లనుంచి వసూలు చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. వెనువెంటనే ఆ నాయకుడి అనుచరులు డీలర్ల దగ్గరికెళ్లి అన్న కూతురు వివాహం గ్రాండ్‌గా చేసేందుకు తల ఒక బస్తా చక్కెర ఇవ్వాలని అన్న చెప్పమన్నాడని హుకుం జారీ చేశారు. దీంతో బెంబేలెత్తిన డీలర్లు సమావేశమై  అంత చక్కెర తెచ్చి ఇవ్వలేమని చెప్పగా మీ డీలర్‌షిప్‌లు ఎలా ఉంటాయో చూస్తామని బెదిరించినట్లు సమాచారం. చివరకు  ఒక్కో చౌకదుకాణ డీలరు  అర బస్తా చొప్పున చక్కెర ఎత్తి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

కొనుగోలు చేసి ఇచ్చిన డీలర్లు..
తూకాల్లో మోసం చేసినా అర బస్తా చక్కెర మిగిలించి ఇవ్వలేమని భావించిన  డీలర్లు   ఆళ్లగడ్డకెళ్లి కొనుగోలు చేసి తెచ్చి ఇచ్చి నట్లు సమాచారం.  చౌకదుకాణంలోని చక్కెర  ఇస్తే డీలర్లు ఎంత మిగిల్చుకుంటున్నారో అని  ప్రజలు భావిస్తారు..లేదంటే ఆ అధికారపార్టీ నాయకుడు ఎక్కడ అధికారులకు  చెప్పి నిత్యం వేధిస్తారోనని  బయట కొనుక్కొచ్చి ఇచ్చినట్లు   మండల ంలోని కొందరు డీలర్లు వాపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement