అట్టాడ ఝాన్సీరాణి... కంచిలి మండలంలోని కత్తివరం గ్రామంలో ఓ రేషన్ డీలర్ ఆమె! సమీప గ్రామమైన పెద్దశ్రీరామపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాదిన రామారావుకు నచ్చలే! అంతే తమ పార్టీ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ద్వారా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఆమెకు డీలర్‌షిప్ దూరం చేశాడు. తిరిగి రేషన్ డిపో తీసుకునేందుకు ఆమె జేసీ కోర్టులో అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం చేతులెత్తేస్తున్నారు! ఇలా ఆమె ఒక్కరే కాదు ఈ నాలుగేళ్ల కాలంలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న డీలర్లు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఫలితంగా దాదాపు 450 రేషన్ డిపోలకు డీలర్లు లేని పరిస్థితి!
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకూ ఉన్న రేషన్ డిపో డీలర్లకు వేధింపులు ప్రారంభమయ్యాయి. తొలి ఏడాదిలోనే జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో సుమారుగా 300 మంది రేషన్ డీలర్లపై సివిల్ సప్లయ్ చట్టంలోని 6ఏ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి స్టాక్ రిజిస్ట్రర్, సరుకుల నిల్వల మధ్య తేడా ఉన్నా, తూనికల్లో తేడా వచ్చినా, నిర్ణీత ధర కన్నా ఎక్కువగా కార్డుదారుల నుంచి వసూలు చేసినా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తుంటారు. కానీ 2014 ఆగస్టు తర్వాత నుంచి దాదాపు ఏడాది కాలం పాటు ఎలాంటి లోపాలు లేకపోయినా సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో దాడులు నిర్వహించారు. అడ్డగోలుగా కేసులు బనాయించారు.
కేసులు తేలిపోయాయి...
రేషన్ డీలర్లపై బనాయించిన కేసులు దాదాపు అన్నీ రాజకీయ కక్ష సాధింపులే కావడంతో న్యాయస్థానాల్లో తేలిపోయాయి. బాధిత డీలర్లు చాలామంది హైకోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి డీలర్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగానికి, ప్రధానంగా రెవెన్యూ డివిజన్ అధికారుల (ఆర్డీవోల)కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఎంత ఒత్తిళ్లు తెచ్చినా గడిచిన ఏడాదిగా డీలర్లపై అక్రమ కేసులు బనాయించడానికి ఆర్డీవోలు మొగ్గు చూపించట్లేదు. అయితేటీడీపీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీల సభ్యులు మాత్రం తమకు అనుకూలంగాలేని డీలర్లను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడక్కడా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు.
వేధింపులు తాళలేక డీలర్‌షిప్‌కు రాంరాం...
ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇస్తున్నప్పటికీ గతంలో ఆరేడు రకాల రేషన్ సరుకులు డిపోల ద్వారా అందేవి. వాస్తవానికి జిల్లాలో 2,400 డిపోలు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 1,950 మాత్రమే పనిచేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల పలువురు డీలర్లు ఈ బాధ్యతల నుంచి విరమించుకుంటున్నారు. తర్వాత ఈ ఖాళీలను రెవెన్యూ అధికారులు భర్తీ చేయలేని పరిస్థితి. దీనికీ రాజకీయ కారణాలే అడ్డొస్తున్నాయి. ఒకవేళ ఎవ్వరికైనా డీలర్‌షిప్ ఇస్తే సొంతపార్టీలోనున్న ఇతర పోటీదారులు దూరమవుతారనే భయం వెంటాడుతోంది. దీంతో నోటిఫికేషన్ కూడా విడుదల చేయట్లేదు.
డీలర్లపై ఎందుకీ కన్ను...
జిల్లాలో మొత్తం 8,27,329 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 24.25 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏళ్ల తరబడి రేషన్ డీలర్లుగా ఉన్నవారు స్థానికంగా ఈ కార్డుదారులను ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది డీలర్లు గ్రామాల్లో రాజకీయాలను శాసిస్తున్నారు కూడా. దీంతో సహజంగానే డీలర్లను గుప్పిట్లో పెట్టుకుంటే ఎన్నికలలో ఓట్లు పడతాయనే భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారు. దీంతో డీలర్లపై ఒత్తిళ్లు పెంచారు. తమకు వ్యతిరేకంగా ఉన్నారనే ఏ చిన్న అనుమానం వచ్చినా వారిని ఏదొక సాకుతో తొలగించి, ఆ స్థానంలో తమవారిని నియమించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇందులో జన్మభూమి కమిటీ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. తమ మాట వినని రేషన్ డీలర్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు జరిగేలా ఒత్తిళ్లు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఉషారాణి పోరాటం...
కంచిలి మండలం కత్తివరం గ్రామానికి చెందిన అట్టాడ ఝాన్సీరాణి రెండు దశాబ్దాలుగా రేషన్ డిపో నిర్వహిస్తున్నారు. అదే మండలంలోని పెద్ద శ్రీరాంపురానికి చెందిన టీడీపీ నాయకుడు మాదిన రామారావు చేస్తున్న అక్రమాలకు ఆమె సహకరించలేదు. దీంతో కక్షగట్టిన అతను ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో ఉన్న చనువును అస్త్రంగా చేసుకున్నాడు. జిల్లాకు చెందిన మంత్రికి చెప్పించి విజిలెన్స్ దాడులు చేయించారు. డిపో సీజ్ అయ్యింది. అయితే రూ.2,500 జరిమానా చెల్లించాలని జేసీ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ డిపోను యథావిధిగా ఆమెకే అప్పగించాలని టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఎమ్మెల్యే అశోక్ అభ్యంతరం చెప్పడంతో ఆ రేషన్ డిపో నిర్వహణ బాధ్యత ఆమెకు అప్పగించడానికి వెనుకంజ వేశారు. జేసీ ఉత్తర్వులు కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇదే విషయమై సదరు ఉషారాణి బంధువులు ఎమ్మెల్యేను వేడుకుంటే... ‘అక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువ ఉన్నాయ్. జేసీ కాదు కదా సీఎం చెప్పినా మీకు రేషన్ డిపో రాదు. నేను మా కార్యకర్త మాదిన రామారావుకి మాత్రమే సహకరిస్తా. మా ప్రభుత్వంలో మా వాళ్లే డిపో నిర్వహించాలి’ అని ఘాటుగా హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో తాము కూడా హైకోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం కనిపించట్లేదని ఉషారాణి వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment