
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీకి డీలర్లు అంగీకరించలేదు. ముందు చెప్పినట్లు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని, సరుకులకు డీడీలు కట్టబోమని డీలర్లు స్పష్టం చేశారు. గౌరవ వేతనం, కమీషన్ల పెంపు, పాత బకాయిల విడుదల తదితర సమస్యల పరిష్కారానికి జూలై 1 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె విషయమై డీలర్ల సంఘం ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం చర్చలు జరిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుతోపాటు సంఘం ప్రతినిధులు బత్తుల రమేశ్, నాగరాజు, సంజీవరెడ్డి, కొండల్‌రెడ్డి, అన్వర్ పాషా, ప్రసాద్‌గౌడ్, సురేందర్ తదితరులు చర్చలకు హాజరయ్యారు. కేరళ, తమిళనాడు మాదిరి డీలర్లకు వేతనాలివ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సంఘం నేతలు కమిషనర్‌ను కోరారు.
అకున్ సబర్వాల్ స్పందిస్తూ.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారని, సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రేషన్ దుకాణాల నిర్వహణతో వచ్చే ఆదాయం, లాభంపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్, పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌కు సమర్పిస్తామని.. మూడు రోజుల తరువాత మళ్లీ చర్చలకు పిలుస్తామని వివరించారు. కానీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని డీలర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేయడంతో.. మహిళా సంఘాలతో రేషన్ పంపిణీకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
పంపిణీకి సిద్ధం: అకున్ సబర్వాల్
డీలర్ల సమ్మె చట్ట విరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016, నిత్యావసర సరుకుల చట్టం–1955 ప్రకారం సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. డీలర్లు సమ్మెకు వెళ్లినా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పేదలకు సరుకులు అందించే కనీస బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉందని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా తమ వద్ద ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment