కత్తిగట్టారు!
కత్తిగట్టారు!
Published Tue, Jan 24 2017 9:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
కర్నూలులో దారుణ హత్య
- ప్రాణం తీసిన ఈ-పాస్ కుంభకోణం
- మృతుడు ప్రజాపంపిణీ
డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
- విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష
- కిరాయి హంతకుల ప్రమేయంపై
పోలీసుల అనుమానం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ హత్యతో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. ఈ పాస్ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారనే కక్షతో బాధిత డీలర్లు కిరాయి హంతకులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు శివారులోని జొహరాపురానికి చెందిన వెంకటేష్ గౌడ్ రేషన్‌షాపు డీలర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవికి ఒక కుమారుడు, కూతురు. వీరు నగరంలోని బిర్లాగడ్డలో నివాసం ఉంటున్నారు. రెండో భార్య పేరు కూడా లక్ష్మీదేవినే. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుతూరు సంతానం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వెంకటేష్‌గౌడ్ సమీప బంధువు. నగరంలోని అన్ని పార్టీల నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకటేష్‌గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.
ప్రాణం మీదకు తెచ్చిన ఈ–పాస్ కుంభకోణం
నాలుగైదు నెలల క్రితం జిల్లాలో ఈ–పాస్ కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు బైపాస్ చేసి ప్రజల సరుకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. బైపాస్ చేసిన సమాచారాన్ని వెంకటేష్‌గౌడ్ విజిలెన్స్ అధికారులకు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఇందులో కర్నూలు నగరంలోనే 100 మంది ఉన్నారు. దీంతో వీరందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు సస్పెండైనా డీలర్లు ఆయనపై కక్ష పెంచుకొని హత్య చేయించినట్లు తెలుస్తోంది.
కిరాయి హంతకుల పనేనా?
మద్దూరు నగర్‌లోని జానీ సైబర్‌ల్యాండ్‌లో ఉన్న వెంకటేష్‌గౌడ్‌ను ఆటోలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు సెకన్ల వ్యవధిలో హత్య చేశారు. వేటకోడవళ్లతో తలపై ఒక్క దెబ్బతో ప్రాణం తీశారంటే కచ్చితంగా కిరాయి హంతకుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేష్ తలపై నిలువుగా నరకడంతో వెనుక వైపు నుంచి ముందు భాగం వరకు చీలిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అడ్డు వచ్చిన సైబర్‌ల్యాండ్ నిర్వాహకుడు రఘు, మరోవ్యక్తి చంద్రేశేఖరరెడ్డిలపైనా దుండగులు దాడి చేశారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చంద్రశేఖరరెడ్డిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎనిమిది మంది డీలర్లపై హత్య కేసు నమోదు
వెంకటేశ్‌గౌడ్ హత్య కేసులో భార్య సుమలత(లక్ష్మీదేవి) ఫిర్యాదు మేరకు నగరంలోని 8 మంది డీలర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. అనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, ఎరుకలి శీను, నూర్‌బాషా, వడ్డేగేరి రమేష్, లక్ష్మన్న, ప్రమీలమ్మ తదితరులు కిరాయి హంతకులతో కలిసి తన భర్తను హత్య చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement