• ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని డిమాండ్
• 10న ఇందిరా పార్కు వద్ద నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయినప్పటికీ తమ సమస్యలు మాత్రం తీరడం లేదంటూ ప్రభుత్వ చౌక ధరల దుకాణ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చేయడం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అయినా సర్కారు స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గతేడాది ఆగస్టులో ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై మంత్రికి 15 సార్లు విజ్ఞప్తి చేశామని, కమిషనర్‌ను కలిసినా, ప్రభుత్వం తమ సమస్యలను పక్కన పెట్టేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు 10వ తేదీన ఒక రోజు దీక్ష చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని రమేశ్‌బాబు చెప్పారు.
ఇవీ ప్రధాన డిమాండ్లు...
⇔ రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేకుంటే కనీసం రూ.20వేల –రూ.30వేల గౌరవ వేతనమన్నా ఇవ్వాలి.
⇔ ఆరోగ్య కార్డులు, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి.
⇔ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ విధానం అమలు చేస్తున్న 1,545 రేషన్ డీలర్లకు తొమ్మిది నెలలుగా ఇవ్వాల్సిన కమీషన్‌ను చెల్లించాలి. ఒక్కో డీలర్‌కు కనీసం రూ. లక్ష దాకా కమీషన్ ఇవ్వాల్సి ఉంది.
⇔ ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకో వడానికి చెల్లించాల్సిన డీడీల కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.