సాక్షి, ఆచంట (పశ్చిమ గోదావరి): రేషన్ డీలర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. హామీలు అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు గాలికి వదిలి వేయడంతో వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కమీషన్ పెంపు, నగదు ప్రోత్సాహకాలు, డిమాండ్ల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలనీ కమీషన్‌తో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం
జిల్లావ్యాప్తంగా 2186 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు, రాగులు, జొన్నలు వంటి నిత్యవసరాల పంపిణీ జరుగుతోంది. రేషన్ దుకాణాలలో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెట్టడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత ఏర్పడింది. నాటి నుంచి డీలర్లు వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రేషన్ డీలర్ల జేఏసీ 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచింది. అనేక తర్జన భర్జనల అనంతరం వీటిలో ఐదు డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు.
వాటిలో రేషన్ సరుకులు ఆయా దుకాణాలకు చేర్చే క్రమంలో హమాలీల ఖర్చులు ప్రభుత్వమే భరించడానికి, డీలరు ఆకస్మికంగా చనిపోతే వారి కుటుంబాల వారికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించడానికి అంగీకరించింది. చంద్రన్న బీమాలో రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు, రేషన్ దుకాణాలకు విద్యుత్ సరఫరా, ఇంటి పన్నులు జనరల్ కేటగిరీలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. ఆయా హామీలను జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఆశలు పెట్టుకున్న డీలర్లకు రోజులు గడుసున్న కొద్దీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక జీవోలు విడుదల కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమలుకు నోచుకోని కమీషన్ పెంపు జీవో
డీలర్ల డిమాండ్లలో వేతనం అమలు ప్రధానమైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని దీనిపై అధ్యయానికి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుందన్న డీలర్ల వేదనతో స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాలుకు ఇస్తున్న కమీషన్ రూ.70 కు అందనంగా మరో 30 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈమేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కానీ నేటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. విడుదల చేసిన జీవో కూడా అస్పష్టంగా ఉందని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో జీవోలో పొందుపర్చకపోవడాన్ని డీలర్లు దుయ్యబడుతున్నారు. కంటి తుడుపు చర్యలో భాగంగానే జీవో జారీ చేశారని డీలర్లు వాపోతున్నారు.
చెల్లుబాటు కాని చెక్కులు
రేషన్ డీలర్ల పనితీరు.. పంపిణీ సంతృప్తికరంగా ఉంటే నగదు పోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన డీలరుకు రూ.2 వేలు నగదు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. నగదుకు జనవరిలో జిల్లా వ్యాప్తంగా 461 మంది డీలర్లు ఎంపికయ్యారు. గత నెలలో తూతూ మంత్రంగా ఓ 50 మంది డీలర్లకు చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ ఊసే లేదు. ప్రోత్సాహక చెక్కులు పట్టుకుని బ్యాంకులకు వెళ్లిన డీలర్లకు చుక్కెదురైంది. బ్యాంకులో జమ చేసిన డీలర్ల చేతికి నేటికీ సొమ్ములు చేతికందలేదు. ఆరా తీస్తే ఖజానాలో సొమ్ములు లేవంటూ అధికారులు చెప్పుకొస్తున్నారని డీలర్లు వాపోతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా రేషన్ పంపిణీ శాతం 85 నుంచి 90 శాతం ఉంటే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం ఇస్తామంటూ మరో ప్రకటన చేయడాన్ని డీలర్లు ఆక్షేపిస్తున్నారు. ఇచ్చిన చెక్కులకు దిక్కులేదు మరో ఐదు వేలా అంటూ నిట్టూరుస్తున్నారు. గంపెడాశతో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని సన్మానించిన డీలర్లకు చివరికు మొండి చేయి చూపడంపై డీలర్లు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం డీలర్లను నమ్మక ద్రోహం చేసిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం డీలర్ల సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నా హామీలు నెరవేరకపోవడంతో డీలర్లు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కమీషన్ పెంచుతూ జారీ చేసిన జీవో నేటికీ అమలు కాలేదు. మరో నాలుగు డిమాండ్ల పెంపునకు అంగీకరించి నేటికీ జీవో జారీ చేయలేదు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– రాజులపాటి గంగాధరావు, రేషన్ డీలర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment