
ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్: డీఎస్‌ఓ
జహీరాబాద్ టౌన్: రేషన్ డీలర్లకు కార్డుదారులు ఆధార్ నంబరు ఇస్తేనే ఇకపై రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏసురత్నం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీ లోపు వారివారి రేషన్ డీలర్లకు అందజేయాలని సూచించారు. లేకుంటే ఇంటింటా సర్వే చేసి కార్డును శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.
ఆధార్ కార్డు లేనివారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకొందని, ఇలాంటి కార్డులుంటే రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేయాలన్నారు. కార్డుదారుడు మరణించినా, ఒకరి పేరిటే రెండు కార్డులు ఉన్నా, గ్రామాల్లో ఉండని వారి కార్డులను కూడా బోగస్‌విగా గుర్తిస్తామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ కేంద్రాల్లో సన్నబియ్యం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కిలో రూ. 30 చొప్పున 30 కిలోలు పొందవచ్చని సూచించారు. నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అర కిలో చక్కెర అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఆయన మండలంలోని డీలర్లతో సమావేశమయ్యారు. బోగస్ కార్డులు ఉంటే అందజేయాలని డీలర్లకు సూచి ంచారు. కార్డుదారులు కోరిన సరుకులనే పంపి ణీ చేయాలని సూచించారు. బలవంతంగా అవసరం లేని సరుకులు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్‌లను తెరచి ఉంచాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్లు చంద్రశేఖర్, జనార్దన్, డీలర్లు పాల్గొన్నారు.