కర్నూలు(సెంట్రల్) : ఇటీవల కర్నూలులోని బుధవార పేటలో 45 క్వింటాళ్ల బియ్యాన్ని మూడో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని అలంపూర్‌లో ఉన్న ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు పట్టుబడిన హమాలీలు చెప్పారు.
♦ డోన్‌లో 80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడి 20 రోజులైంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
♦ ఆళ్లగడ్డలోని ఓ గోదాములో ఉంచిన 120 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నారు.
..ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ జిల్లాలోని ఏదో మూలన రేషన్ బియ్యం పట్టుబడుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి ఎంఎల్‌ఎస్(మండల లెవల్ స్టాక్)పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేసే వాహనాలను జీపీఆర్‌ఎస్ ద్వారాఅనుసంధానం చేసి రవాణా చేస్తారు. పౌర సరఫరా దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాకు ఈ–పాస్ మిషన్లతో అనుసంధానం చేసి పేదలకు బియ్యంతో సహా ఇతర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా అక్రమాలకు తావు ఇవ్వకుండా ప్రజా పంపిణీ సరుకులను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నా బియ్యం దొంగలు మాత్రం తమ అక్రమ వ్యాపారాన్ని ఎంచక్కాగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతీ నెలలో సుమారు 4.5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది.
డీలర్ల ట్రిక్కు...
కర్నూలు జిల్లాలో 2,346 రేషన్‌దుకాణాల పరిధిలో 11,71956 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా 19,120.975 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు బియ్యం పక్కదారి పడుతోంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరన్నా నానుడి చందంగా రేషన్ దుకాణాల డీలర్లే ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ–పాస్ మిషన్ ద్వారా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నా వక్రమార్గం ఎంచుకుంటున్నారు. మామూలుగా అయితే వినియోగదారులు బియ్యం కోసం తెచ్చిన సంచిని కూడా కాట వేసి దానిని బరువుకు సరితూగు బియ్యాన్ని వేయాలి. అయితే ఇక్కడి పరిస్థితులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముకుంటాయి. మొదట ఈపాస్ మిషన్ కోసం సంచితోపాటు తూకం వేస్తారు. ఆ వెంటనే మళ్లీ రెండు, మూడు కేజీల బరువున్న బొలెలు/ గిన్నెలు/ బక్కెట్లను పెట్టిమళ్లీ తూకం వేస్తారు. ఇలా పది కేజీలకు ఒకసారి తూకం తీసుకుంటారు. అంటే ఒక్క 20 కేజీల రేషన్ కార్డుకు దాదాపు 4 కేజీల వరకు బియ్యం తూకంలో మాయం అవుతుంది. ఇలా నూరు కేజీలకు 20 కేజీల బియ్యం డీలర్ ఖాతాలో చేరుతుంది. ఒక మెట్రిక్ టన్నుకు 200 క్వింటాల ప్రకారం వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 19,121.975 మెట్రిక్ టన్నుల బియ్యానికి 3,824.2 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్ల దగ్గర మాయవుతోంది.
ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనూ అదే తంతు...
మరోవైపు మండల లెవల్ స్టాక్ పాయింట్లలోనూ బియ్యం భారీగానే మాయవుతోంది. ఇక్కడికీ వచ్చిపోయే రవాణా సరుకు లారీలను తూకం వేసి పంపుతున్నా తూకాల్లో మాత్రం తేడాలు వస్తున్నాయి. అంతేకాక ఇక్కడ లారీల లారీల సరుకు పందికొక్కుల పాలవుతున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. క్వింటానికి నాలుగైదు కేజీల తరుగు వస్తోందని డీలర్లు బహిరంగానే చెబుతుఆన్నరు. క్వింటానికి నాలుగు కేజీల ప్రకారం అనుకున్నా మెట్రిక్కు టన్నుకు 40 కేజీలు, 19121 మెట్రిక్ టన్నులకు 764.84 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.
పర్యవేక్షణ కరువు...
డీలర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం పక్కదారి పడుతున్నట్లు పౌర సరఫరాల అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు ఉంటారు. తూకాల్లో మోసాలను వారు మామూలుగానే పరిగణిస్తారు. ఒక డీలర్ బియ్యాన్ని తీసుకెళ్లితే మధ్య మధ్యలో అధికారులు తనిఖీ చేసి చూడాలి. రేషన్‌కార్డులు, పంపిణీ చేసిన బియ్యానికి లెక్కలను పరిగణలోకి తీసుకొని సరిౖయెనా స్టాక్‌ఉందోలేదో చూడాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, ఆర్‌ఐలు పర్యవేక్షించాలి. అయితే అలాంటి పర్యవేక్షణా ఎక్కడా కనిపించదు. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా బియ్యాన్ని పక్కదారి పట్టించు సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అయితే కొందరు అధికారులే పాత్రదారులు.
రేషన్ బియ్యం పట్టివేత
కర్నూలు : చౌక డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తుండగా రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన కురువ సుంకమ్మ, కర్నూలు మండలం నిర్జూరు గ్రామానికి చెందిన కురువ జగదీశ్ తదితరులు 30 బస్తాల రేషన్ బియ్యాన్ని బోలేరో వాహనంలో తీసుకువెళ్తుండగా గురువారం సాయంత్రం రెండో పట్టణ పోలీసులు దర్మపేట సర్కిల్ వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.
తూకాల్లో మోసం చేస్తే చర్యలు
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు. తూకాల్లో మోసాలు చేస్తే షాపును సీజ్ చేస్తాం. ఇలాంటి సంఘటలపై ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమానం వస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. – పద్మశ్రీ , డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment