భయోమెట్రిక్
భయోమెట్రిక్
Published Thu, Aug 11 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
తాళ్లపూడి : ఎరువుల విక్రయాలకు ప్రభుత్వం బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నుంచి ఈపోస్ ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆధార్ కార్డు ఇవ్వాలనే నిబంధన విధించింది. ఆధార్‌కు వెబ్‌ల్యాండ్‌ను లింకప్ చేయడం కౌలు రైతులకు ముప్పుగా మారింది. ఈ విధానం ద్వారా అవసరమైన ఎరువులు పూర్తిగా అందవని, అరకొరగానే ఎరువులు ఇస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఎరువుల విక్రయాలకు బయోమెట్రిక్ పద్ధతిని నిరసిస్తూ మలకపల్లి సొసైటీ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొసైటీ కార్యకలాపాలను అడ్డుకున్నారు.
ఎరువుల పంపిణీ ఇలా
రెండు రోజుల నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు తీసుకురావడంతో పాటు, బయోమెట్రిక్ పద్ధతిలో ఈ పోస్ మిషన్‌లో వేలిముద్రలు కూడా వేసి తీరాలనే నిబంధన అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ఎరువుల డీలర్లకు, షాపులకు, సొసైటీలకు ఈ పోస్ మిషన్లను అందజేశారు. ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసిన తరువాత రైతు వేలిముద్ర వేయగానే సంబంధిత వ్యక్తికి సంవత్సరంలో ఎంత పరిమాణంలో ఎరువులు ఇవ్వాలి అనే వివరాలు డిస్‌ప్లే అవుతాయి. యూరియా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు తెలుపుతున్నాయి. వెబ్‌ల్యాండ్ దీనికి అనుసంధానం చేశారు. అదేవిధంగా భూసార పరీక్షల ఫలితాలు కూడా లింకప్ చేశారు. దానికి అనుగుణంగా సిఫార్సు మేరకు ఎరువులను అందచేస్తారు. కౌలు రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే కూడా అసలు యజమాని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. లేకుంటే ఎరువులు ఇవ్వడం లేదు. దీంతో సమస్య తీవ్రరూపం దాల్చింది.
మలకపల్లిలో రైతుల ఆందోళన
దీనిపై మలకపల్లిలోని రైతులు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడీఏ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేయడంపై ఏవో స్పందించకపోవడంపై మండిపడ్డారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళ్లపూడి మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవనారాయణ, మద్దుకూరి అనీల్, చెరుకూరి వెంకటరావు, సత్యనారాయణ, గద్దే గంగన్న, కొలిశేట్టి నాగేశ్వరరావు, తెలగరెడ్డి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ఆధార్‌కార్డు లింక్ పెట్టి, బమోమెట్రిక్ విధానం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదన్నారు. కౌలు రైతుకు ఆధార్ కార్డు అసలు యజమాని ఇవ్వడంలేదని వారికి మరింత నష్టం జరుగుతుందని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో పొలం వివరాలు కూడా తప్పుగా నమోదు చేశారన్నారు. వరికి ఆరు బస్తాల ఎరువు అవసరం కాగా సగం కూడా ఇవ్వడంలేదన్నారు. కందకు 30 బస్తాలు, చెరకుకు 20 బస్తాలు, అరటికి 25 బస్తాలు అవసరమవుతుందని అయితే అన్ని పంటలకు ఒకేలా ఎరువుల మోతాదును పేర్కొన్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
కౌలు రైతులకు ఎరువులు ఎలా
కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. ఎరువులు కొనుగోలు చేయడానికి వస్తే అసలు యజమాని ఆధార్‌కార్డు తీసుకురమ్మంటున్నారు. వారు కార్డు ఇవ్వనంటున్నారు. మరి మేము ఏం చేయాలి. ఎరువులు ఎలా అందుతాయి. ఈ విధానం బాగోలేదు.
– రాగు అన్నవరం, కౌలు రైతు మలకపల్లి.
ఈ పోస్ విధానం సరికాదు
భూసార పరీక్షలకు అనుగుణంగా ఈ పోస్ ద్వారా ఎరువులు అమ్మకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. అసలు భూసార పరీక్షలు సక్రమంగా చేయడంలేదు. గ్రామంలో నామమాత్రంగా శాంపిల్స్ తీసుకుని కార్డులు ఇస్తున్నారు.
– మద్దుకూరి అనీల్‌కుమార్, మలకపల్లి
తప్పులతడకగా వెబ్‌ల్యాండ్
నాకు 4.32 ఎకరాల భూమి ఉంది. ఎరువుల కోసం సొసైటీకి వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి వేలిముద్ర వేయగా 1.70 ఎకరాల భూమి ఉన్నట్టు వచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో భూమి తక్కువగా నమోదైంది. ఈ ప్రకారమే ఎరువులు ఇస్తారట. వెబ్‌ల్యాండ్ అంతా తప్పులతకడగా ఉంది.
– కుంటముక్కల ప్రేమ్‌చంద్, రైతు, మలకపల్లి
Advertisement
Advertisement