మూడేళ్లుగా కరువుతో అల్లాడిన రైతులకు.. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. కానీ ఈ సంతోషం అట్టే నిలిచే పరిస్థితి లేకుండాపోయింది. బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉంది కదా అని దుక్కులు సిద్ధం చేసుకున్న అన్నదాతలకు విద్యుత్ లోఓల్టేజీ, కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య అశనిపాతంలా పరిణమించాయి. కరెంట్ సక్రమంగా సరఫరా కాకపోతుండడంతో నారుమడులు, కరిగెట్లు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఎంతో ఆశతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతులను ఈ పరిస్థితి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. పంటలు పండుతాయా.. ఎండుతాయా అనే మీమాంస వారిని వెంటాడుతోంది. - న్యూస్‌లైన్, యాచారం
యాచారం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా సాగుకు సిద్ధమవుతున్న రైతులను ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. తరచూ కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో ఇబ్బందులు, వాటికి సకాలంలో అధికారులు రిపేర్లు చేయకపోవడం వంటి సమస్యలను తలచుకుని సాగంటేనే భయపడుతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో దాదాపు 5,600 వ్యవసాయ బోరుబావుల కింద ఈ ఏడాది సుమారు వెయ్యి హెకార్లకు పైగా విస్తీర్ణంలో వరి, కూరగాయలు, ఆకు కూరల పంటలు సాగు చేసేందుకు రైతులు సంసిద్ధమయ్యారు. సింగారం, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, తక్కళ్లపల్లి, యాచారం, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఇప్పటికే వరి నాట్ల పనులు జోరందుకున్నాయి. మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లి, చింతుల్ల, గునుగల్ గ్రామాల్లో కూరగాయలు, ఆకు కూరల సాగు ప్రారంభమైంది. కాగా.. విద్యుత్ లోఓల్టేజీ, కరెంట్ కోతలు, మోటార్లు కాలిపోతుండడం వంటి కారణాలతో పొలాలకు సాగునీరు సరిగా అందడంలేదు. దీంతో కరిగెట్లు ఎండిపోయే దశకు చేరుకుంటున్నా యి. పొలం సిద్ధం కాకపోవడంతో నారు ము దురుతోంది. అలాగే విద్యుత్ ఫ్యూజులు, బోరుమోటార్లు తరచూ కాలిపోతున్నాయి. దీంతో తొలి దశలోనే రైతులు పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
మరమ్మతు ఖర్చులు తడిసి మోపెడు..
విద్యుత్ మోటార్ల మరమ్మతుల ఖర్చులు అమాంతం పెరిగాయి. మోటారు మరమ్మతు లు చేయాలంటే రూ. 4వేలు ఖర్చు పెట్టాల్సివస్తోంది. రైతులకు విద్యుత్ సమస్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగునీరు అందకపోవడంతో దున్నిన కరిగెట్లు పగుళ్లు వస్తున్నాయి. కూరగాయల తోటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయి. విద్యుత్ సమస్యపై ట్రాన్స్‌కో అధికారులను అడిగితే.. పై నుంచి వచ్చిన కరెంట్‌ను మాత్రమే సరఫరా చేసే బాధ్యత తమదంటుటూ రైతులకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిత్యం ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా.. వాస్తవంగా అందుతోంది మాత్రం 5 గంటలకు మించడం లేదు. తమ ఇబ్బందులను గుర్తించి అధికారులు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తే తప్ప సాగయ్యే పంటలు చేతికందుతాయంటున్నారు రైతులు.
ఏడు గంటల కరెంట్ ఇవ్వాలి
వ్యవసాయ బావులకు ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఆయా గ్రా మాల్లో సమయ పట్టికలు ప్రకటించాలి. అత్య వసర పరిస్థితుల్లో కరెంటు తీసేస్తే మళ్లీ ఆ లోటు పూడ్చాలి. సరఫరా చేసే విద్యుత్ సక్రమంగా వస్తే రైతులకు ఇబ్బంది ఉండదు.
- దెంది రాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి
ట్రాన్స్‌ఫార్మర్లకు తక్షణమే మరమ్మతులు చేయాలి
ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యలు వచ్చినప్పుడు రైతులు సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు తక్షణమే స్పందిం చాలి. అవసరమైన చోట స్తంభాలు పాతాలి, ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాలి. అప్పుడే రైతులు సర్వీస్ చార్జీలను సక్రమంగా చెల్లిస్తారు.
- కె. బుచ్చిరెడ్డి, రైతు సంఘాల మండల అధ్యక్షుడు
పరిమిత విస్తీర్ణంలో వరి సాగు చేపట్టాలి
రైతులు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో వరి సాగు చేయవద్దు. ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలి. లోఓల్టేజీ సమస్య ఉన్న రైతులు డీడీలు చెల్లిస్తే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తాం. సర్వీస్ చార్జీలను కూడా చెల్లి ంచాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ఫిర్యాదు చేయాలి. - శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ, యాచారం
పండేనా.. ఎండేనా!
Published Sat, Jan 4 2014 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement