సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టవర్లు, లైన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో భూములు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందని ద్రాక్షగా మారింది. జిల్లా కలెక్టర్లు పరిహారం చెల్లింపు ఊసే ఎత్తడం లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో నిర్లిప్తతతో.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ మేరకు బాధిత రైతు ఒకరు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. పరిహారం ఇప్పించే అధికారం తమకు లేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా అదే కేసులో చిత్రమైన ఆదేశాలు జారీ చేయడంతో బాధిత రైతులను పట్టించుకునేవారే లేకుండా పోయారు.
పరిహారం కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లండి..
రైతు పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్ 2017 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’ అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది.
‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 కింద పరిహారాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు సహజ న్యాయ సూత్రాలు, భూసేకరణ చట్టాలను అనుసరించాలి. కేంద్రం జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే’నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిహారం నిర్ణయించాలి. పిటిషనర్ ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరైన పరిహారం కోరవచ్చు. ’అని కమిషన్ ఆదేశించింది. రైతులకు పరిహారం అందకపోవడం పట్ల ఈ ఉత్తర్వుల్లో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టర్లు జారీ చేసిన పరిహారం ఉత్తర్వులను సమీక్షించించే అధికారం కమిషన్‌కు ఉందని కూడా స్పష్టం చేసింది.
కలెక్టర్లదే అధికారం:
కేంద్ర విద్యుత్ నిబంధనలు–2006 ప్రకారం టవర్ల నిర్మాణానికి తప్పనిసరిగా రైతులు/భూయజమానుల సమ్మతి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. కాగా టవర్ల ఏర్పాటుతో భూములు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించి ఇప్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 27న ‘వర్క్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్’పేరుతో జీవో ఎంఎస్ నం.24 జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం కూడా పరిహారం ఇప్పించే బాధ్యత కలెక్టర్లదే.
ఈఆర్సీ ఆదేశాలు బేఖాతరు:
ఈఆర్సీ 2017లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ తర్వా త వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వెంకట్‌రెడ్డి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నారు. కానీ కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయన 2020లో మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ.. ఈఆర్సీ ఉత్తర్వులు అమలు చేయని కలెక్టర్లు, ట్రాన్స్‌కోపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కోరారు.
తాజాగా ఈఆర్సీ విచిత్ర ఆదేశాలు
భూ సేకరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయా లని జిల్లా కలెక్టర్‌ను గత ఉత్తర్వుల్లో ఆదేశించినప్పటికీ, అందులో పిటిషన్‌దారుడైన బాధిత రైతు కేసు ను నిర్దిష్టంగా ప్రస్తావించలేదని ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ను సంప్ర దించడానికి రైతుకు కమిషన్ స్వేచ్ఛ ఇవ్వలేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని ట్రాన్స్ కోను కూడా ఆదేశించలేదని పేర్కొంది. కాబ ట్టి ఈఆర్సీ ఆదేశాలను జిల్లా కలెక్టర్, ట్రాన్స్‌కో అధికారులు బేఖాతరు చేశారన్న అంశం ఉత్పన్నం కాదని, వీరిపై చర్యలు తీసుకోలేమంటూ స్పష్టం చేసింది.
కొత్త లైన్లకు సైతం లభించని పరిహారం
నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి దామరచర్ల–డిండి, దామరచర్ల–చౌటుప్పల్ వరకు 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వందల మంది రైతుల పొలాల్లో టవర్లు వేసినప్పటికీ పరిహారం చెల్లించలేదు. కల్లెపల్లికి చెందిన మాతృ నాయక్‌కు ఎకరంన్నర పొలం ఉండగా, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలల కిందట టవర్ వేశారు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు ఠాగూర్‌కు 3 ఎకరాల పొలం ఉండగా 4 నెలల కిందట టవర్ వేశారు. పరిహారం ఇవ్వలేదని, అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారని ఆయన వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment