జూలైలో వరదలు, వర్షాలతో 1.65 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి నష్టం
తుది అంచనాల్లో 55 వేల ఎకరాలకు కుదింపు
30వేల మందికి రూ.37.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు
నెలరోజులు కావస్తున్నా పైసా విదల్చని ప్రభుత్వం
నష్టపరిహారం కోసం బాధిత రైతుల నిరీక్షణ
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్ర బాబు ప్రభుత్వం ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. గతనెల కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు 16 జిల్లాల పరిధిలో 70 వేల మంది రైతులకు సంబంధించిన 1.65 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 5 వేల ఎకరాల్లో వరినారు మడులు, 1.25 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
నారుమళ్లున్న చోట ఎకరాకు రూ. 6వేలు, నాట్లుపడిన చోట ఎకరాకు రూ.10వేల వరకు రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయారు. ఇతర పంటలు సాగుచేసిన రైతులైతే ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టపోయారు. పైగా సీజన్‌లో విలువైన పంటకాలాన్ని కోల్పోయారు. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులు పంటనష్టం అంచనాలు రూపొందించారు.
పంట నష్టం కుదింపు..
తొలుత.. ప్రాథమిక అంచనాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించగా.. తుది అంచనాల్లో అది 55 వేల ఎకరాలకు కుదించేశారు. అలాగే, 16 జిల్లాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ముందు అంచనా వేయగా, చివరికొచ్చేసరికి ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకే పరిమితం చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో 30 వేల మంది రైతులకు చెందిన 55 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్లు లెక్కతేల్చారు.
అదే విధంగా.. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో మరో 914 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల్లో లక్షా 25 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు చివరకు 40వేల ఎకరాలకు పరిమితం చేశారు. ఇలా మొత్తమ్మీద వరదలు, వర్షాలవల్ల పంటలు నష్టపోయిన 30వేల మంది రైతులకు రూ.37.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) లెక్కతేల్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఫలించని రైతుల ఆశలు..
ఇక తుది నివేదిక రాగానే వారం పదిరోజుల్లోనే పరిహారం జమచేస్తామని క్షేత్రస్థాయి పర్యటనల్లో మంత్రులు ఊదరగొట్టారు. అలాగే, రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) వెంటనే విడుదల చేయాలంటూ ఆగస్టు మొదటి వారంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకేముంది.. తమ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమవుతుందని రైతులు సంబరపడ్డారు.
పెట్టుబడి సాయం ఎలాగూ జమచేయలేదు.. ఇన్‌పుట్ సబ్సిడీ అయినా చేతికొస్తే కొంతమేర ఆసరాగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు ఫలించలేదు. నెలరోజులు కావస్తున్నా ఆర్థికశాఖ నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ ఫైల్‌కు మోక్షం కలగకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సీజన్ ముగిసేలోగా వస్తుందిలే కంగారెందుకు అంటూ మండలస్థాయి అధికారుల నుంచి వస్తున్న పరిహాసపు సమాధానాలతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment