ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్‌ | Transco to strengthen transmission network | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్‌

Published Sat, Jun 17 2017 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్‌ - Sakshi

ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్‌

► ప్రణాళిక సిద్ధం చేసిన ట్రాన్స్‌కో
► విద్యుత్‌ శాఖలో కొత్తగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ విభాగం
► లిఫ్ట్‌లకు ప్రపంచంలోనే భారీ సామర్థ్యపు మోటార్లు
► సీఎంకు నివేదిక అందించిన ట్రాన్స్‌కో సీఎండీ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల(లిఫ్ట్‌) ప్రాజెక్టులకు విద్యుత్‌ను అందించేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు సమగ్ర కార్యాచరణ నివేదికను అందించారు.

2020 నాటికి వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, దాన్ని నిరాటం కంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో ప్రస్తావిం చిన ముఖ్యాంశాలు ఇవీ.. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో అన్ని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు కలిపి 11,500 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్‌ను సమకూర్చాల్సిందిగా తెలంగాణ జెన్‌కోను కోరింది.

ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల విభాగం
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ట్రాన్స్‌కో తన సంస్థలో మొదటిసారిగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డైరెక్టర్, ఇద్దరు సీఈలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించి, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు విద్యుత్‌ను ఇచ్చే పనులను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం లిఫ్ట్‌ల కు 11,500 మెగావాట్ల విద్యుత్‌ కావాలని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 400 కేవీ సబ్‌ స్టేషన్లు పది, 220 కేవీ సబ్‌ స్టేషన్లు ఇరవై నాలుగు, 132 కేవీ సబ్‌ స్టేషన్లు 25, వీటికి ప్రత్యేకంగా లైన్లు కావాలని అంచనా వేసింది. దీనికి రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క గట్టింది. ఈ ఖర్చును నీటిపారుదల శాఖ భరిస్తుంది. నిర్మాణం, నిర్వహణ ట్రాన్స్‌కో బాధ్యత. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత లిఫ్ట్‌ల నిర్వహణకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని అంచనా వేసింది. ఈ బిల్లును ఇరిగేషన్‌ శాఖ చెల్లిస్తుందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.

భారీ సామర్థ్యంతో లిఫ్ట్‌ మోటార్లు
రాష్ట్రంలో లిఫ్ట్‌లకు అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా 139 మెగావాట్ల ఇంజన్లు వినియోగించనున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి సామర్థ్యం కలిగిన ఇంజన్లు వాడడం లేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఆస్ట్రియా వెళ్లి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు మోటార్ల తయారీ బాధ్యత అప్పగించారు. వచ్చే ఏడాది మేడిగడ్డ పంప్‌హౌస్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేసేందుకు మోటార్లు అందుబాటులోకి వస్తాయి.

రాష్ట్ర చరిత్రలో గరిష్టంగా 30 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లను కల్వకుర్తి లిఫ్ట్‌లకు వాడుతున్నారు. కాళేశ్వరం నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో భారీ సామర్థ్యంగల మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. రామగుడు దగ్గర 139 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్‌ 120 మీటర్ల ఎత్తులో 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. చంద్లాపూర్‌ వద్ద 134, మేడారం వద్ద 124, తిప్పాపూర్‌ వద్ద 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు మూడు వేలకు పైగా క్యూసెక్కుల సామర్థ్యంతో వంద మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేస్తాయి.

400 నుంచి 11,500 మెగావాట్ల వరకు..
రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో లిఫ్ట్‌లకు 400 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా ఉండేది. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, బీమా, భక్త రామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములతో పాటు అన్ని లిఫ్ట్‌లకు కలిపి 1,263 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు 4,600, పాలమూరు ప్రాజెక్ట్‌కు 4,000, సీతారామ ప్రాజెక్ట్‌కు 690 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. ఇతర చిన్న లిఫ్ట్‌ల అవసరాన్ని సైతం కలిపితే మొత్తం 11,500 మెగావాట్ల విద్యుత్‌ కావాలి. వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. అప్పటికి రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కూడా 27 వేల మెగావాట్లకు చేరుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement