సాక్షి, హైదరాబాద్: బొగ్గు లభ్యత లేకనే ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలుపుదల చేయడంలో వాస్తవం లేదని పేర్కొంది. మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది.
‘రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్‌కో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘సొంత అవసరాల బొగ్గు గని (క్యాప్టివ్ మైన్) నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో అడ్డంకుల నేపథ్యంలో రోడ్డుతోపాటు రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తోంది. ఇతర వనరుల నుంచి కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. ఆలస్యంగానైనా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కాప్టివ్ గని కేటాయింపులు జరగడంతో బొగ్గు లభ్యత చేకూరడంతోపాటు విద్యుత్ వేరియబుల్ ధర తగ్గింపునకు దోహదపడింది.
దీంతో అధిక ధరలతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను నివారించినట్టు అయింది. తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులకు లోబడి ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలను అంగీకరించడం జరిగింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 కింద ఆర్‌ఈసీ/పీఎఫ్‌సీల ద్వారా పాత బకాయిల చెల్లింపునకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ స్థిర ధర (ఫిక్స్‌డ్ కాస్ట్) మినహా టారిఫ్ విషయంలో ఇతర తీవ్రమైన వివాదాలేమీ లేవు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర ధరను ఢిల్లీలోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం.
ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర చార్జీలను పరిగణనలోకి తీసుకున్నా, షార్ట్ టర్మ్ మార్కెట్, ఎక్సే్ఛంజీల విద్యుత్ ధరలతో పోటీపడేలానే ఉంది. విద్యుత్ ధరలను ఛత్తీస్‌గఢ్ అసాధరణంగా పెంచేసిందనడం సరికాదు. ఎందుకంటే, ఈఆర్సీ ఖరారు చేసిన టారిఫ్‌ను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది’అని ట్రాన్స్‌కో తెలిపింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా లేకున్నా, అందుకోసం బుక్ చేసుకున్న ట్రాన్స్‌మిషన్ లైన్లకు చార్జీలు చెల్లిస్తున్న అంశంపై సైతం ట్రాన్స్‌కో వివరణ ఇచ్చింది. పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లతోపాటు పవర్ బ్యాంకింగ్ అవసరాలకు ఈ లైన్లను వాడుకుంటున్నట్టు తెలిపింది.
ట్రాన్స్‌కో, డిస్కంల భిన్న వాదనలు
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తెలంగాణ ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలు ఇచ్చిన వివరాలు, ‘సాక్షి’ కథనంపై తెలంగాణ ట్రాన్స్‌కో ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. బొగ్గు కొరత వల్లే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ఆగినట్టు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో డిస్కంలు ఎక్కడా పేర్కొనలేదు. ఛత్తీస్‌గఢ్‌కి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలతోపాటు మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయంపై వివాదంతోనే సరఫరా జరగడం లేదని తెలిపాయి.
బకాయిలిచ్చే వరకు సరఫరా చేయం: ఛత్తీస్‌గఢ్
‘మాకు బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను చెల్లించేవరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయం. తెలంగాణకు 2023–24లో ఎలాంటి విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకోబోం’ అని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్‌పీడీసీఎల్).. ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలియజేసింది. ఈ విషయాన్ని తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)–2023–24లో పొందుపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment