
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కోలో సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. భర్తీ ప్రక్రియను జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ప్రశ్నలకు సంబంధించి సరైన జవాబులు ఏవో తేల్చేందుకు ఐఐటీ, ఉస్మానియా, జేఎన్‌టీయూ ప్రొఫెసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను పరిశీలించి సరైన జవాబులు ఏమిటో తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌కోలో సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఒక్కో చోట ఒక్కో రకంగా పేర్కొన్నారని, అందువల్ల తమకు ఒక్కో మార్కు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన వెంకటేశ్, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను జూన్ 4 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.